అతని దగ్గర వందల కోట్ల ఆస్తులున్నాయి. కానీ 150 సార్లు అడిగినా 150 రూపాయల లాకర్ అద్దె చెల్లించలేదు. దాని ఎఫెక్ట్ అతనిపై మామూలుగా పడలేదు. అక్రమంగా కూడబెట్టిన 8 వందల కోట్ల ఆస్తులు 8 గంటల్లోనే ఐటీ శాఖ అధికారులు పట్టుకెళ్లిపోయారు. బెంగళూరులోని ది బౌరింగ్ బ్యాడ్మింటన్ క్లబ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బెంగళూరులోని ది బౌరింగ్ క్లబ్ బ్యాడ్మింటన్ రూమ్ లాకర్స్ ఇప్పుడు ఇండియాలోనే హాట్ టాపిక్‌గా మారాయి. 3 లాకర్లలో 8 వందల కోట్లకు పైగా సంపద బయటపడటంతో అంతా అవాక్కయ్యారు.
బౌరింగ్ క్లబ్ బ్యాడ్మింటన్ రూమ్‌లో మెంబర్ల కోసం పెద్దసంఖ్యలో లాకర్లను ఏర్పాటు చేశారు. వీటికి నెలకు ఒక్కో లాకర్‌కు ఇంతకుముందు 5 రూపాయలు వసూలు చేసేవారు. ఈ మధ్యే దానిని నెలకు 50 రూపాయలకు పెంచారు. ఇక్కడే అవినాష్ అమర్‌లాల్ కుఖ్రేజా పేరుతో 3 లాకర్లున్నాయి. కొన్ని నెలలుగా ఆయన లాకర్లకు రెంట్ చెల్లించడం లేదు. దీంతో బౌరింగ్ క్లబ్ సిబ్బంది చాలాసార్లు ఆయనను డబ్బులడిగినా స్పందించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన క్లబ్ సిబ్బంది గత శుక్రవారం రోజు ఆ మూడు లాకర్లను వేరొకరికి కేటాయించేందుకు తాళాలను బద్దలుకొట్టారు. అంతే అందులో ఉన్న సంపద చూసి షాకయ్యారు.
అవినాష్ అమర్‌లాల్‌కు చెందిన 3 లాకర్లు తెరిచిన సిబ్బంది అందులోని డబ్బు, వజ్రాలు, బంగారం, ఆస్తి పత్రాలను చూసి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులు, ఐటీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. లాకర్లలో ఉన్న వాటిలో 3 కోట్ల 96 లక్షల నగదు, 8 కోట్ల విలువైన వజ్రాలు, 8 వందల కోట్ల విలువైన ఆస్తిపత్రాలు, బ్లాంక్ చెక్కులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అవినాష్ వెళ్లే మరో క్లబ్‌కు కూడా ఐటీ సిబ్బంది వెళ్లారు. అక్కడ తనిఖీలు చేసి మరికొన్ని పత్రాలు స్వాధీనం చేసుకొన్నారు.
సింధి ప్రాంతానికి చెందిన అవినాష్ ఒక వ్యాపారవేత్త. అతనికి రాజకీయ నాయకులు, బడా అధికారులతో ఎక్కువ పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. బినామీ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బౌరింగ్ క్లబ్ ఘటనతో. బెంగళూరులోని మరికొన్ని క్లబ్‌లు అప్రమత్తమయ్యాయి. తమ దగ్గర ఎంతోకాలంగా తాళాలు వేసిఉన్న లాకర్లను తెరవాలని నిర్ణయించాయి.