తండ్రి మరణం.. ఏ కుమారుడికైనా తీరని లోటే. చిన్నప్పటి నుంచి అన్నీ తానై పెంచిన నాన్న తనతోడు లేడని తెలిస్తే ఆ తనయుడికి ఒంటరిననే భావన వెంటాడుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. అలాంటి సందర్భంలో తన తండ్రి గురించి స్టాలిన్ చివరిసారిగా రాసిన కవిత తండ్రి కరుణానిధిపై ఆయనకున్న వాత్సల్యాన్ని తెలియజేస్తుంది.
65 యేళ్లుగా తన తోడుగా నీడగా ఉన్న అప్ప లేడని తెలిసిన స్టాలిన్ గుండె పగిలేలా రోధించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు వెంట ఉన్నా కంటికి రెప్పలా పెంచిన తోడు లేడని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. సహచరులు ఎంతగా ఓదార్చుతున్నా ఆయన కంట కన్నీరు మాత్రం ఆగలేదు.
స్టాలిన్‌కు కరుణానిధి కేవలం తండ్రి మాత్రమే కాదు. గురువు, మార్గనిర్దేశకుడు కూడా. చిన్నప్పటి నుంచే తండ్రిని ఓ నాయకుడిగానే చూశారు. తన జీవితాంతం ఆయన్ని ప్రజా ఉద్యమాల్లో, రాజకీయాల్లోనే చూశారు. అందుకే స్టాలిన్‌కు ఆయనే నాయకుడు. తన జీవితాన్ని ఉన్నతంగా మల్చిన కరుణానిధిని నాన్నా అని పిలవడం కన్నా.. లీడర్ అని పిలవడమే తనకిష్టమంటూ స్టాలిన్ ట్విట్టర్‌లో ఓ కవిత రాశాడు.
తన తండ్రి మరణించిన క్షణాన.. స్టాలిన్ చేసిన ట్విట్ అందరినీ ఆలోచింపజేస్తుంది. కరుణానిధిని అప్ప అని పిలచేకంటే.. లీడర్ అని పిలవడమే తనకిష్టమని ట్వీట్టర్లో పేర్కొన్నారు. తన జీవితాంతం.. కరుణానిధిని లీడర్‌గానే కొలుస్తానని అన్నారు. అయినా చివరిసారిగా అప్పా అని పిలవనా అంటూ స్టాలిన్ చేసిన ట్విట్.. తన తండ్రిపై ఆయనకున్న వాత్సల్యాన్ని చూపిస్తుంది.
ఇంతకాలం మిమ్మల్ని అప్పా అని కాకుండా తలైవరే అనే ఎక్కువసార్లు పిలిచాను. చివరిసారిగా ఒక్కసారి మిమ్మల్ని అప్పా అని పిలవచ్చా తలైవరే. తమిళ రాష్ట్ర సంక్షేమం కోసం మీరు చేసిన సేవ పూర్తైందనుకుని వెళ్లిపోయారా అప్పా. మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవారు కాదు. కానీ ఈ సారి ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయారు? ఒక్కసారి నా ప్రియమైన సోదరులారా..అని మమ్మల్ని పిలవండి. ఆ పలుకే మరో శతాబ్దం వరకు కలిసి పోరాడేందుకు మాకు శక్తినిస్తాయి.
80 ఏళ్లుగా మీరు తమిళనాడు కోసం చేసిన సేవలు, సాధించిన రికార్డులు మీకే సాధ్యం. జూన్ 3న మీ పుట్టినరోజు, మీకున్న నైపుణ్యాలలో సగం వంతు నాకు ఇవ్వండి అని ఒకసారి మిమ్మల్ని వేడుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ గురువు అన్నాదురై వెళ్లిపోతూ ఆయన హృదయాన్ని మీకు ఇచ్చినట్లే.. మీ హృదయం నాకు ఇస్తారా? ఎందుకంటే మీరు కన్న కలలు మేం పూర్తి చేస్తాం. అంటూ భావోద్వేగంతో స్టాలిన్ లేఖలో తెలిపారు.