తెలంగాణలోనే ఆ నియోజకవరానికి ఓ ప్రత్యేకత ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు గత ఏడాది నుంచి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ పట్టు సాధిస్తే కాంగ్రెస్‌పై విజయం సాధించినట్లుగా గులాబీదళం భావిస్తుంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదనుకుంటున్నారా....కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కంచుకోట కొడంగల్. ఇప్పుడు ఆ కంచుకోటను బద్దలు చేసేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు మోహరించారు. అటు వన్ మ్యాన్ ఆర్మీలా, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు రేవంత్. ఐటీ, ఈడీ దాడుల తర్వాత, కొడంగల్ క్యాంపెయినింగ్‌లో పాల్గొన్న రేవంత్, విమర్శల వాగ్భాణాలు సంధించారు. అసలు కొడంగల్ దంగల్ ఎలా సాగుతోంది?
కొడంగల్. స్టేట్ పాలిటిక్స్‌లో హాట్‌హాట్ కాన్‌స్టిట్యూఎన్సీ. ఎందుకంటే, ఇక్కడ పోటీ చేస్తున్నది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కొడంగల్‌లో ఎన్నికల వాతావరణ వాడివేడిగా కొనసాగుతోంది. రాష్ట స్థాయిలో నేతల హడావుడితో కొడంగల్ అట్టుడికిపోతోంది. అధికార పార్టీ నేతలు, మంత్రుల హామీలు, ప్రతిపక్ష పార్టీల శపథాలతో పాలిటిక్స్ హీటెక్కాయి. రేవంత్ టీడిపీకి రాజీనామా చేసిన నాటి నుంచే, కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణానికి రాజుకుంది. రేవంత్ రాజీనామాతో కొడంగల్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందని, అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో బైపోల్స్ మాట మరిచి ముందస్తు ఎన్నికల వాతావరణం తెరమీదకు వచ్చింది. దీంతో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కాకముందే కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ నేతల పర్యటనలు, సమావేశాల హడావుడి మొదలైంది.
ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో ఏరిపారేసినట్టు ఉండే కొడంగల్‌ను, గత పాలకులు, ప్రస్తుత పాలకులు అభివృద్ది పరచడంలో నిర్లక్ష్యం వహించినా నేడు ముందస్తు ఎన్నికలు నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మాత్రం కొడంగల్ను అభివృద్ది చేస్తామని, డెవలప్‌మెంట్ మంత్రం జపిస్తూ నియోజకవర్గాన్ని చుట్టిముట్టేస్తున్నారు. పార్టీ నేతలే కాదు ముఖ్యంగా మంత్రులు కూడా కొడంగల్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే మంత్రులు విస్త్రుత పర్యటనలు కొనసాగిస్తూ.. అభివృద్ది చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, నియోజకవర్గంలోనే ఉంటూ విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. తన గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులను ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. మంత్రులు మహెందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్ది, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు, ఇప్పటికే కొడంగల్ నియోకజవర్గంలో విస్త్రుతంగా పర్యటనలు కొనసాగించారు.
ఇటు రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రతిష్టాత్మకమైన తన నియోజకవర్గంలో, ప్రచారాన్ని ఒంటిచేత్తో కొనసాగిస్తున్నారు. ఐతే ఓవైపు అధికార పార్టీ మంత్రులు, నేతల విస్త్రుత పర్యటనలు కొనసాగిస్తుండగా, రేవంత్ మాత్రం కాంగ్రెస్ నాయకులు అవసరం లేకుండా, వన్ మ్యాన్ షోలా బైక్ ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ ఆశావహుల తరపున ప్రచారం చేస్తూనే, తన నియోజకవర్గంలోనూ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఐటీ దాడుల అనంతరం, దాదాపు 20 రోజుల తర్వాత మళ్ళీ తన నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు రేవంత్. దౌల్తాబాద్ నుంచి రోడ్ షాలు, బైక్ ర్యాలీలతో ప్రచారాన్ని ముమ్మరం చేసి.. ప్రత్యర్థిపై ఎదురు దాడి కొనసాగిస్తున్నారు. ఎక్కడ సమయం దొరికినా మంత్రి మహేందర్‍రెడ్డికి, అతని తమ్ముడు నరేందర్‍రెడ్డిలకు సవాళ్ళు విసురుతున్నారు. కొడంగల్ అభివృద్దిపై చర్చకు సిద్దమా అంటూ సవాళ్ళు విసురుతున్నారు.
ఐతే టీఆర్ఎస్ ఆపద్దర్మ మంత్రులు, నేతలు మాత్రం ఎన్నికల ప్రచారంలో కొడంగల్ చుట్టూ చక్కర్లు కొడుతుండగా రేవంత్ రెడ్డి మాత్రం 20 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రచారాన్ని ప్రారంభించారు. తనపై జరుగుతున్న దాడుల మాటే మరిచి, నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మొత్తానికి రేవంత్ ఓటమే లక్షంగా టీఆర్ఎస్ నాయకులు ముందుకు సాగుతుండగా.. తన గెలుపు నల్లేరు మీద నడకే అన్న భావనతో రేవంత్ ముందుకు సాగుతున్నారు. మరీ రాష్ట్ర రాజకీయాల్లో, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కొడంగల్లో ఓటర్లు ఎవరికి ఓటేసి.. ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.