ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుతం

Update: 2018-07-28 01:16 GMT

ఆకాశంలో అద్భుతం జరిగింది. అర్ధరాత్రి పూట.. ఖగోళంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. అందాల చందమామ.. అరుణ వర్ణంలో రెట్టింపు అందంతో మెరిసిపోయింది. నల్లని ఆకాశంలో.. ముదురు ఎరుపు రంగులో జాబిలి బ్లడ్‌మూన్‌గా కనువిందు చేసింది.
రాత్రి 10 గంటల 44 నిమిషాలకు మొదలైన సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహం.. ఒంటి గంట తర్వాత సంపూర్ణ దశకు చేరుకుంది. పూర్తిగా.. రెడ్ కలర్‌లోకి మారి.. అందరినీ అబ్బురపరిచింది. తర్వాత క్రమంగా చంద్రుడు భూమి నీడలోంచి బయటకు రావడంతో.. రెండో దశ మొదలైంది. అలా.. సంపూర్ణ చంద్రగ్రహణం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముగిసింది.

గ్రహణానికి ముందు తెలుపు వర్ణంలో ప్రకాశవంతంగా మెరిసిపోయిన చందమామ.. భూమి నీడ పడి.. క్రమంగా మసకబారిపోయింది. తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయి.. నెమ్మదిగా ముదురు ఎరుపు వర్ణంలో బ్లడ్ మూన్‌గా మారి అందరినీ అలరించింది. జాబిలి వింతపోకడలను.. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు.. దేశం మొత్తం ఆసక్తిగా తిలకించింది.

హైదరాబాద్, అమరావతి, వైజాగ్, తిరుపతి.. ఇలా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు బ్లడ్ మూన్‌ను ఆసక్తిగా వీక్షించారు. ఈ అరుదైన ఖగోళ వింతను చూసేందుకు.. ముందు నుంచే అంతా ప్రిపేర్ అయ్యారు. రాత్రి 10 గంటల నుంచే.. ఇళ్ల పైకి ఎక్కేశారు. చాలా మంది వీధుల్లోకి వచ్చేశారు. వైజాగ్ లాంటి ప్రాంతాల్లో.. బీచ్‌ల దగ్గరికి చేరిపోయారు. అలా.. 103 నిమిషాల సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూశారు. ఎరుపు రంగులోకి మారిన బ్లడ్‌మూన్‌ను చూసి అచ్చెరువొందారు. ఆకాశంలో ఎరుపు రంగులో మెరిసిపోతున్న చందమామతో.. సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. ఢిల్లీ, జైపూర్, పుణె, ముంబై, త్రివేండ్రం, వారణాసి వాసులతో పాటు దేశ ప్రజలంతా.. 21వ శతాబ్దపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరికీ.. ఈ అద్భుత దృశ్యం కనువిందు చేసింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. అంతా వీధుల్లోకి వచ్చి.. చందమామలో జరిగిన మార్పులను ఆసక్తిగా గమనించారు.

శతాబ్దకాలం తర్వాత ఏర్పడిన ఈ గ్రహాణాన్ని చూడకూడదని కొందరు పండితులు, జ్యోతిషులు చెప్పారు. సంప్రదాయలు, ఆచారాలపై నమ్మకం ఉన్న వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొందరు.. ఇవేవీ పట్టించుకోకుండా.. సైంటిస్టులు చెప్పినట్లుగా బ్లడ్‌మూన్‌ను చూశారు. వందేళ్ల అద్భుతాన్ని వంద నిమిషాల పాటు చూస్తూ ఉండిపోయారు. 

ఆకాశ వీధిలో ఆవిష్కృతమైన ఈ అద్భుత ఘట్టాన్ని.. ప్రపంచం మొత్తం ఇంట్రస్టింగ్‌గా చూసింది. టెలిస్కోపులతో కొందరు, బైనాక్యులర్స్‌తో ఇంకొందరు, అబ్జర్వేటరీలతో మరికొందరు.. ఇలా.. ఎవరికి తోచిన విధంగా వారు.. 21వ శతాబ్దపు సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించారు. ఈ అరుదైన దృశ్యం.. చిన్నా, పెద్దా అందరినీ అబ్బురపరిచింది. 

సంపూర్ణ చంద్రగ్రహణాన్ని.. మినిట్ టు మినిట్ నాసా లైవ్‌లో ప్రసారం చేసింది. క్రమంగా రంగులు మారిన చందమామ అందాలను ప్రపంచం కళ్లకు కట్టింది. మూన్ నుంచి.. బ్లడ్ మూన్‌గా మారే వరకు.. ప్రతి క్షణాన్ని ప్రపంచం గమనించింది. గ్రహణం కనిపించిన ప్రతి దేశంలోని వాళ్లంతా.. ఈ ఎక్లిప్స్‌ను ఎంజాయ్ చేశారు.

ఆసియా, మధ్య ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. ఉత్తర అమెరికా, ఆర్కిటిక్‌ పసిఫిక్ ప్రాంతాల్లో చంద్రగ్రహణం ఆలస్యంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియాలో బ్లడ్ మూన్ కాస్త లేటుగా కనిపించింది. మళ్లీ.. ఇలాంటి సంపూర్ణ సుదీర్ఘ చంద్రగ్రహణం.. 2123వ సంవత్సరం జూన్ 9న ఇలాంటి అద్భుతం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మరోవైపు.. ఈ అద్భుత చంద్రగ్రహణం అనుభూతిని రెట్టింపు చేసేందుకు.. అంగారకుడు కూడా జోడీ కట్టాడు. బ్లడ్ మూన్‌తో పాటు.. మార్స్ దర్శనానికి కూడా ఆకాశం వేదికైంది. అంగారక గ్రహం.. భూమికి అతి చేరువగా వచ్చింది. 4 రోజుల పాటు రాత్రివేళల్లో మార్స్ మనకు కనిపించనుంది. ఈ నెల 31న.. భూమికి అతిచేరువగా రానుంది అరుణగ్రహం. 31న.. మరింత ప్రకాశవంతంగా అంగారకుడు కనిపిస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Similar News