తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బీజేపీ టార్గెట్ చేసిందా..? ఎన్నికల సమరానికి బీజేపీ అప్పుడే రెడీ అయిపోయిందా..? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బీజేపీ నేతలు కేసీఆర్ సర్కార్‌పై అడుగడుగునా ఆరోపణలు చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీ నేతలకు ధీటుగా ఎదురుదాడికి దిగుతున్నారు టీఆర్‌ఎస్ నేతలు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌన్సిలర్ కూతురిని ఫోన్‌లో బెదిరిస్తున్నాడని, మా మాట వినకుంటే అందరినీ జైల్లో పెట్టేస్తామని, బస్తీ మొత్తాన్ని లేపేస్తామంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇంత మగతనంలేనోళ్లా అని వ్యాఖ్యానించారు.
రాంమాధవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు రాంమాధవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మీకున్న సీట్లెన్ని, ఒక్క గ్రామంలోనైనా సర్పంచ్‌లు ఉన్నార అని ప్రశ్నించారు.
సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ ప్రెస్ కాన్ఫరెన్స పెట్టిమరీ 3శాతం కమీషన్ గురించి చెప్పిన విషయాన్ని రాంమాధవ్ గుర్తు చేశారు. కాంట్రాక్టర్ తమకు ఇవ్వడం లేదని, స్వయంగా మంత్రిగారే కమీషన్ అడుగుతున్నారని చెప్పినట్టు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అవినీతిని రూపుమాపే విషయంలో వైఫల్యం చెందిన మీరు కేటీఆర్‌ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
మరోవైపు రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్‌ది గారడీ ప్రభుత్వమన్నారు. చెప్పే మాటలకు , ఆయన చేతలకు పొంతన ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్ధతుతో కాషాయ జెండాను తెలంగాణలో ఎగరేస్తామంటున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కేసీఆర్ సర్కార్‌పై బాణాలు సంధిస్తూ... ప్రజల్లోకి దూసుకుపోతోంది.