బీఎడ్ విద్యార్థులకు తీపికబురు! ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) చదివిన వారు కూడా అర్హులేనని ప్రకటించింది. అయితే, ఇందుకు సదరు అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం గెజిట్‌ను విడుదల చేసింది. అలాగే బీఎడ్ అభ్యర్థులు.. ఎస్జీటీ పోస్టుల్లో చేరిన తర్వాత రెండేళ్లలోపు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందంటూ మరో నిబంధనను కూడా విధించింది. ఇప్పటిదాకా ఎస్జీటీ పోస్టులను(1-5వ తరగతి వరకు బోధన) డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) పూర్తి చేసిన వారితో.. స్కూల్ అసిస్టెంట్(6-10 వరకు బోధన) పోస్టులను బీఎడ్ అభ్యర్థులతో భర్తీ చేస్తూ వచ్చారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో కూడా కొన్నే బీఎడ్ అభ్యర్థులకు దక్కేవి. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70శాతం ఎస్జీటీలకు ప్రమోషన్ల ద్వారా.. మిగతా పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేవారు. దీంతో టీచర్ పోస్టుల భర్తీలో బీఎడ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపించేవి. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉండగా.. వందల సంఖ్యలోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడంతో పోటీ తీవ్రంగా ఉండేది. దీంతో ఎస్జీటీ పోస్టులకు తమకూ అవకాశం కల్పించాలని బీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు తమను కూడా పరిగణించాలని డిమాండ్ చేస్తూ కొందరు బీఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. కొంత ఉపశమనం కల్పించింది. ఎస్జీటీ పోస్టుల్లో 70శాతం డీఈడీ విద్యార్థులతో.. మిగతా 30శాతం డీఎడ్‌తో పాటు బీఎడ్ చదివిన వారికీ అవకాశం ఇవ్వాలని తీర్పునిచ్చింది.
ఈ తీర్పు ఆ ఒక్క డీఎస్సీకీ మాత్రమే పరిమితమైంది. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన టీఆర్టీలో పాత విధానాన్నే పాటించారు. టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1941 ఉండగా ఎస్జీటీ పోస్టులు 5415 ఉండడం గమనార్హం. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉండడం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండడంతో బీఎడ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీఎడ్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై మాత్రం కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.