వొట్టి మాటలు కట్టిపెట్టోయ్...గట్టిమేల్ తలపెట్టవోయి...అన్నాడు గురజాడ. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లోనూ, వొట్టి హామీలు పక్కనెట్టి, బాండు పేపర్ మీద సంతకపెట్టవోయ్ అంటున్నారు గ్రామస్థులు. ప్రచారానికి ఊళ్లోకి రావాలంటే, పొలిమేరల్లోనే బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. బాండ్ పేపర్ మీద సంతకం పెడితే మొదటికే ఇబ్బందని, కొందరు అసలు ఆ ఊరివైపే వెళ్లకుంటే, కొందరు అభ్యర్థులు సంతకానికి సై అంటున్నారు. ఇంతకీ ఏదా గ్రామం...ఎందుకా పట్టుదల?
ఎన్నికల హయాంలో వివిధ పార్టీల అభ్యర్థులు రావడం, హామీలివ్వడం, ఐదేళ్లు ముఖం చాటేయడం. అభ్యర్థుల అబద్దాలను చూసి, కోనంపేట గ్రామస్థులు విసిగిపోయారు. రాజకీయ పార్టీల మీదే నమ్మకం కోల్పోయారు. అందుకే అందరూ కలిసి, ఒక తీర్మానం చేశారు. అదే, బాండ్ పేపర్ అగ్రిమెంట్. ప్రచారానికి వచ్చే అభ్యర్థులు రోడ్డు, తాగు, సాగునీరు కల్పించాలని, అందుకు హామీగా బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని షరతుపెట్టారు గ్రామస్థులు. లేని పక్షంలో ఊళ్లోకి రానివ్వమని ఫ్లెక్సీలు కట్టారు. దీంతో చాలామంది అభ్యర్థులు, గ్రామంలోకి రావడానికే జడుసుకుంటున్నారు.
అయితే, కోనంపేట గ్రామానికి ప్రచారం కోసం బీజేపీ అభ్యర్థి వచ్చారు. అక్కడి యువకులు గ్రామ పొలిమేరలోనే ఆయనను ఆపారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బాండ్ పేపర్ అగ్రిమెంట్ వివరించారు. అయితే కాసేపు బాగా ఆలోచించిన అభ్యర్థి, గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ హామీలు నెరవేరుస్తానని వందరూపాయల బాండ్ పేపర్‌పై సంతకం పెట్టారు. బీటీ రోడ్డు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడతానని వాగ్దానం చేశారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు, వాగ్దానాలపై నమ్మకం కోల్పోయిన జనం, ఇలా చైతన్యంతో నిలదీస్తున్నారు. బాండ్ పేపర్ రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కోనంపేట గ్రామస్థుల చైతన్యం, చుట్టుపక్కల గ్రామాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది.