యాగంతో సంతాన యోగం? ఎంతవరకు నిజం!

Update: 2017-12-26 12:49 GMT

యజ్ఞ యాగాలు చేస్తే కోరికలు సిద్ధిస్తాయా? స్వర్గబోగాలు లభిస్తాయా? పిల్లలు లేని పిల్లలు కలుగుతారా? పుష్యమి నక్షత్రం వేళ పుత్ర కామేష్టి యాగంతో సత్సంతానం కలుగుతుందా? నిజమేనంటున్నారు సువిజ్ఞాన ఆశ్రమ వ్యవస్థాపకులు ఆచార్య సత్యవీర్ స్వామీజీ. మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులో జనవరి 3న తాము నిర్వహించే యాగంలో పాల్గొంటే పిల్లలు పుట్టని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు ఆచార్య సత్యవీర్ స్వామీజీ. అసలేంటి ఇది నిజమేనా? యాగాలతో పిల్లలు పుడుతారా? మంత్రాలకు అంత పవర్‌ ఉందా?

అలనాడు ఎప్పుడో త్రేతాయుగంలో దశరథ మహారాజు సంతానం కోసం చేశారీ యాగాన్ని. పుత్రుల కోసం తంటాలు పడుతున్న మహారాజుకు నాటి రుషులు, మహర్షులు సూచించిన విధి విధానం. సంతానం లేని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసాడని, యాగ క్రతువులో లభించిన పాయసం వలన అతని భార్యలకు పిల్లలు పుట్టారని రామాయణంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు అదే తంతును నిర్వహిస్తామంటున్నారు సత్యవీర్‌ స్వామిజీ. అసలు ఇందులో నిజమెంత? యాగాలతో భోగాలు సిద్ధిస్తాయేమో కానీ పుత్రులో, పుత్రికలో పుడతారా? అసలు ఈ యాగాన్ని అంత పవర్‌ ఉందా?

యజ్ఞ యాగాది వైదిక కర్మలు లోకంలో ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. కాలంతో పాటు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వేష భాషలు, మత విశ్వాసాలు, సామాజక కట్టుబాట్లు మారుతూ వస్తున్నాయి కూడా. అలాంటి సమాజంలో మనషులకు ఆధ్యాత్మిక చింతన కొరవడిందనీ, యాగాలతో వైభోగం సృష్టించే విధానం తమ దగ్గర ఉందని చెబుతున్నారు స్వామి సత్యవీర్‌.

అందుకే అలాంటి అరుదైన అవకాశం వచ్చే జనవరి 3న వచ్చిందంటారు సత్యవీర్‌. ఆ రోజు పుష్యమి నక్షత్రం వేళ పుత్ర కామేష్టి యాగం జరిపితే ఆ యాగంలో పాల్గొంటే సత్సంతానం కలుగుతుందని ఆయన చెబుతున్నారు. 
గతంలో పుత్ర కామేష్టి యాగంలో పలువురు విద్యావంతులు పాల్గొని సంతాన భాగ్యాన్ని పొందారని కొన్ని ఉదాహరణ చెబుతున్నారు స్వామీజీ. ఆధునిక వైద్యం పొందినా ఫలితం లేనివారికి ఈ యాగం మహిమతో పిల్లలు పుట్టారని అంటున్నారు. ఇందుకు ఎందరో దంపతులు సాక్షులుగా ఉన్నారంటారు సత్యవీర్ స్వామీజీ. 

ప్రతి నెల పుష్యమి నక్షత్రం వేళ యాగం చేస్తే ఆ సమయంలో ఔషధాలు బాగా పని చేస్తాయంటున్నారు సత్యవీర్ స్వామీజీ. ఈ యాగంలో వంద రకాల మూలికల పొడి, దేశవాళీ ఆవు నెయ్యి వినియోగిస్తామంటున్నారు. యజ్ఞంలో వాడే మూలికలను పుష్యమి నక్షత్రం రోజునే సేకరిస్తామంటున్నారు. పుత్ర కామేష్టి యాగం పూర్తి శాస్త్రీయ చికిత్స విధానమని , అనేక ఏళ్ల పరిశోధనల అనంతరం వివిధ మూలికలను సేకరించి యాగం నిర్వహిస్తున్నామని సత్యవీర్ స్వామీజీ చెబుతున్నారు. తాము సూచించిన విధంగా ఔషధాలను వాడుతూ, ఆహార పానీయాల నియమాలను పాటిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుందని భరోసా ఇస్తున్నారు. 

మరి నిజంగా మంత్రాలు చింతకాయలు రాలతాయా, యాగాలకే పిల్లలు పుడతారా అని ప్రశ్నిస్తున్నారు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు. యాగంలో సైన్స్ ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సత్యవీర్‌ స్వామిజీ తలపెట్టిన పుత్రకామేష్టి యాగం మరోసారి చర్చకు తెరతీసిందంటారు సామాజికవేత్తలు.

Similar News