చీకటి వ్యాపారంలోకి చిన్నారులు...పెంచుకోవడం కోసం తీసుకొస్తారు...

Update: 2018-08-01 05:46 GMT

వాళ్లంతా అభంశుభం తెలియని చిన్నారులు. అక్షరాలా ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల పసిమొగ్గలు. ఆడుకోవాల్సిన వయసులో అంగట్లో బొమ్మల్లా మారిపోతున్నారు. వెట్టి చాకిరీ పేరుతో ఇంటికి తీసుకొచ్చి, ఆపై వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. గుట్టుగా యాదగిరిగుట్టలో జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు 11 మంది చిన్నారులను రక్షించారు.

చిన్నారుల అక్రమ రవాణా దందా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల్ని పోషించలేని కుటుంబాలను ఎంచుకునే అక్రమార్కులు గతంలో పెద్ద పెద్ద పట్టణాల్లోకి చిన్నారులను తరలించేవారు. కానీ ఇప్పుడు యాదగిరిగుట్టకు పాకింది. రాచకొండ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో 11 మంది చిన్నారులను కాపాడారు. అంతా ఐదు నుంచి ఎనిమిదేళ్ల వయస్సు ఆడపిల్లలు. బాధిత చిన్నారులను రెస్క్యూ హోమ్‌‌కు తరలించారు.

యాదగిరిగుట్టలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కంసాని కల్యాణికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇందులో అలేఖ్య ఆమె సొంత కూతురు. మౌనిక అనే చిన్నారిని ఏడాదిన్నర క్రితం కొనుగోలు చేసింది. తొలుత మౌనికను మంచిగానే చూసుకున్నా ఈ మధ్య కాలంలో అన్నం పెట్టకపోవడం, రోజూ కొట్టడం, తిట్టడంతో పాటు చిత్ర హింసలకు గురి చేస్తోంది. రోజూ మౌనిక అరుపులు, కేకలు వినిపిస్తుండడంతో అనుమానంతో స్థానికులు చైల్డ్‌లైన్, ఐసీడీఎస్, షీ టీం అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐసీడీఎస్‌, రాచకొండ పోలీసుల తనిఖీల్లో చిన్నారుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే కల్యాణిని అధికారులు లోతుగా విచారించగా మౌనిక తన కూతురు కాదని, ఏడాదిన్నర క్రితం యాదగిరిగుట్ట బస్టాండ్‌లో శంకర్‌ అనే వ్యక్తి అమ్మినట్లు చెప్పింది. తనతో పాటు పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన కంసాని సుధలక్ష్మి, శోభ, కంసాని కృష్ణ, కుమారి, మానసలకు కూడా చిన్నారులు అమ్మినట్లు పోలీసుల విచారణలో తెలిపింది.

గణేష్‌నగర్‌లోని వ్యభిచార గృహాల్లో ఉండే మహిళలకు ఏడాదిన్నర క్రితం శంకర్‌ అనే వ్యక్తి చిన్నారులను అమ్మినట్లు కల్యాణి చెప్పడంతో అధికారులు వెంటనే వారి ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. పక్కనే ఉన్న ప్రజ్వల స్కూల్‌లో చదువుకుంటున్న ఆయా కుటుంబాల పిల్లలు సుమారు 10మందిపై అనుమానం రావడంతో ఐసీడీఎస్, చైల్డ్‌లైన్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసీడీఎస్, చైల్డ్‌లైన్, పోలీసు అధికారులు కంసాని కల్యాణి ఇంట్లో సోదాలు చేస్తున్న విషయం తెలుసుకున్న గణేష్‌నగర్‌లోని పలు కుటుంబాలు ఇళ్లకు తాళం వేసి వెళ్లాయి. మిగత వారు ఎవరు లేకపోవడంతో పోలీసులు మరింత సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. అసలు బాలికల రవాణా ఎప్పుటినుంచి జరుగుతుంది..? అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆపరేషన్‌ ముస్కాన్‌‌లో చిన్నారులను రక్షించిన పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక సమాచారం చేపట్టేపనిలో ఉన్నారు. ఇంతకీ అక్కడ ఆడపిల్లల అక్రమ రవాణా ఎప్పటి నుండి కొనసాగుతోంది..? ఈ ఘోరాలకు పాల్పడుతున్నది ఎవరు..? 

యాదగిరి గుట్టలో చిన్నారుల అక్రమ రవాణా కలకలం సృష్టిస్తోంది. చిన్నారులను యాదగిరిగుట్ట ప్రాంతానికి తీసుకువచ్చి అమ్ముతున్న వ్యక్తి స్థానికంగానే ఉండే శంకర్‌ అని కంసాని కల్యాణి అధికారుల విచారణలో తెలిపింది. శంకర్‌ చిన్నారులను ఇక్కడి ఏడాదిన్నర క్రితం తీసుకువచ్చి అమ్మిన తర్వాత మరణించాడని ఆమె పోలీసులకు వివరించింది. అయితే శంకర్‌తో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఇంకొందరు వ్య క్తులు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతే కాదు స్థానికంగానే ఉంటు చిన్నారులతో పాటు అమ్మాయిలను కూడా అక్రమ రవాణా చేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం పీడీ యాక్టు కేసులో జైలు జీవితం గడుపుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు కారకులు ఎవరు..? శంకర్‌ మరణించిన తర్వాత ఈ వ్యాపారం ఎవరు నిర్వహిస్తున్నారు..? స్థానికంగా ఉన్న కల్యాణి అనే మహిళ చెప్పిన విషయాలు నిజమేనా..? అనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 నుంచి 8 సంవత్సరాల ఆడపిల్లల్ని తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలకు శంకర్‌ అప్పగించాడు. ఈ వ్యాపారం సుమారు 10 సంవత్సరాల క్రితం నుంచే జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న వయస్సులో ఉన్న ఆడపిల్లల్ని అన్ని విధాలుగా చిత్ర హింసలు పెట్టి, 14 సంవత్సరాలు రాగానే వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలికలు త్వరగా మెచ్యూర్‌ అయ్యేందుకు ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు తలెత్తడానికి ప్రభుత్వాలే కారణమని, కఠిన చట్టాలు తీసుకువచ్చి, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మహిళా సంఘాలు, కొందరు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేతమైన యాదగిరిగుట్టలో చిన్నారు అక్రమ రవాణా విషయం తెలియడంతో అంతా కంగుతింటున్నారు. ఇక పోలీసుల అదుపులో ఉన్న కల్యాణిని పూర్తి స్థాయిలో విచారణ చేపడితే చిన్నారుల అక్రమ రవాణా గురించి మరిన్ని వివరాలతో పాటు, అసలు నేరస్థులు ఎవరో తెలిసే అవకాశముందని మహిళ సంఘాలు చెప్తున్నాయి.

Similar News