ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు.. వారంలో ఆ రెండు రోజులు విధులకు రావాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు.. ప్రతి మంగళవారం హాజరు కావాలని పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు టీచర్లంతా స్కూళ్లకు వెళ్లాలని ఆదేశించింది. నాడు నేడు కార్యక్రమాన్ని అన్ని స్కూళ్లలో ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, స్కూల్ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్ వేయిస్తోంది. ఆ రంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.