Four-Day Work Week: వారానికి నాలుగు రోజులే పని దినాలు.. ఇప్పటికే అమల్లోకి..!

Four-Day Work Week: వారానికి ఒక రోజు సెలవు. కొన్నేళ్ల క్రితం వరకు కంపెనీలు దీనినే అనుసరించే వారు. కానీ ఐటీ రాకతో వారానికి రెండు రోజులు సెలవు విధానం అమల్లోకి వచ్చింది.

Update: 2025-01-28 04:51 GMT
UK Companies Implementing 4 Days Working Policy

Four-Day Work Week: వారానికి నాలుగు రోజులే పని దినాలు.. ఇప్పటికే అమల్లోకి..!

  • whatsapp icon

Four-Day Work Week: వారానికి ఒక రోజు సెలవు. కొన్నేళ్ల క్రితం వరకు కంపెనీలు దీనినే అనుసరించే వారు. కానీ ఐటీ రాకతో వారానికి రెండు రోజులు సెలవు విధానం అమల్లోకి వచ్చింది. అయితే తాజాగా బ్రిటన్‌లో కొన్ని కంపెనీలు వారానికి మూడు రోజులు సెలవులు, నాలుగు పని దినాల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. దీంతో ఈ విధానంపై ప్రపంచ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. ఈ విధానం వల్ల ఏ మేరకు లాభం జరగనుంది.? భారత్‌లో అమలు చేస్తారా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రిటన్‌లోని వివిధ రంగాలకు చెందిన కంపెనీలు, ముఖ్యంగా మార్కెటింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌తో పాటు ఛారిటీ సంస్థలు ఇప్పటికే వారానికి మూడు రోజుల సెలవు విధానాన్ని పాటిస్తోంది. ఈ నిర్ణయంతో సుమారు 5000 మంది ఉద్యోగులు లబ్ధిపొందుతున్నారు. ‘4 డే వీక్ ఫౌండేషన్‌’ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో, నాలుగు రోజుల పని విధానం వల్ల ఉద్యోగుల ఖాళీ సమయం పెరగడంతో వారి జీవితాలు మరింత సంతృప్తికరంగా మారుతున్నాయని తేలింది.

ఈ విషయమై ‘4 డే వీక్ ఫౌండేషన్‌’ క్యాంపెయిన్‌ డైరెక్టర్‌ జో రైల్‌ మాట్లాడుతూ.."వందేళ్ల క్రితం ఉన్న 9-5 పని ప్రామాణిక విధానం ప్రస్తుతం సమర్థవంతంగా లేదు, ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన సమయం వచ్చింది. నాలుగు రోజుల పని విధానం ఉద్యోగుల జీవితాలను మెరుగుపర్చడమే కాకుండా సంస్థల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది'అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానాన్ని తొలుత మార్కెటింగ్‌, అడ్వర్టైజింగ్‌ రంగాలు అమలు చేశాయి. ఆ తర్వాత ఐటీ, సాఫ్ట్‌వేర్‌, కన్సల్టింగ్‌ వంటి రంగాలు ఇదే దారిలో నడిచాయి. ముఖ్యంగా లండన్‌లో 59 కంపెనీలు ఈ విధానాన్ని అమలుచేస్తున్నాయి.

ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులకు కుటుంబంతో పాటు వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. సంస్థల పనితీరు మెరుగవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్‌లో కూడా ఈ విధానాన్ని పరిశీలించి అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించి చర్చలు జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News