
Osmania Hospital: ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రిని సరికొత్తగా నిర్మించబోతోంది తెలంగాణ సర్కార్. ఈ రోజు ఉదయం 11.55 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా, ఇతర అధికారులు కూడా హాజరవుతారు.
ఉస్మానియా ఆసుపత్రి దశాబ్దాలుగా తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రజలకు వైద్యసేవలందిస్తోంది. ప్రస్తుతం అఫ్జల్ గంజ్ లో ఉన్న ఆసుపత్రి బదులుగా గోషామహల్ స్టేడియం దగ్గర 26 ఎకరాల్లో , 32 లక్షల చదరుపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించబోతున్నారు. 2,000 పడకల సామర్థ్యతో కార్పొరేట్ స్థాయిలో ఉండేలా ఆసుపత్రికి తీర్చిదిద్దబోతున్నారు.
ఆసుపత్రి ప్రత్యేకతలు ఇవే:
ప్రతి విభాగంలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి.
అత్యాధునిక ICU, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు నిర్మిస్తారు.
ఒకేచోట అన్నిరకాల డయాగ్నోస్టిక్ సేవలు లభిస్తాయి.
భవన నిర్మాణ వ్యయం, సదుపాయాలు:
30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వస్తాయి.
రోజూ 5,000 మంది ఓపీ రోగులకు వైద్యం లభిస్తుంది.
హెలిప్యాడ్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.
750 సీట్లతో భారీ ఆడిటోరియం ఉంటుంది. అక్కడ రోగులు, వారి బంధువులు కూడా కూర్చోవచ్చు.
లివర్, కిడ్నీ, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల కోసం ప్రత్యేక ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం రాబోతోంది.
నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు కూడా ఉంటాయి.
వైద్యుల సంఖ్య కూడా 20 శాతం పెరగనుంది.
ఈ ఆసుపత్రి వల్ల హైదరాబాద్ లోని పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. రోజూ వేలాది మంది ఆసుపత్రికి వచ్చి తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ కొత్త ఆసుపత్రిని నిర్మించడంతోపాటు, భవిష్యత్తులో కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసేందుకు కూడా వీలుగా కొన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేయనున్నారు. తద్వారా భవిష్యత్తులో కూడా ఈ ఆసుపత్రి అన్ని రకాలుగా అప్ డేట్, అప్ గ్రేడ్ అయ్యేందుకు వీలుంటుంది.