Investment in Gold: లక్ష మార్క్ వద్ద బంగారం ధరలు... ఇప్పుడు బంగారం కొంటే లాభమా, నష్టమా?

Investment in Gold: లక్ష మార్క్ వద్ద బంగారం ధరలు... ఇప్పుడు బంగారం కొంటే లాభమా, నష్టమా?
Is it right time to buy Gold now? : బంగారం ధరలు ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిపోతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు బంగారం ధరలు కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమెరికా - చైనా మధ్య టారిఫ్ వార్ వంటి పరిణామాలు బంగారం ధరలు అమాంతం పెరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో తులం బంగారం లక్ష రూపాయలకు మరో ఇంచు దూరంలో ఉన్నాయి. దీంతో బంగారం కొనే వారు అయోమయంలో పడ్డారు. బంగారం కొనాలా వద్దా అని సందేహిస్తున్నారు.
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం లాభదాయకమా లేక నష్టమా అనే వివరాలు తెలియాలంటే అంతకంటే ముందుగా ఒకసారి బంగారం ధరలు పెరిగిన తీరును తెలుసుకోవాలి. అసలు విషయం ఏంటో మీకు అప్పుడే అర్థమవుతుంది.
బంగారం ధరలు పెరిగిన తీరు
25 ఏళ్ల క్రితం... అంటే, 2000 సంవత్సంలో తులం బంగారం ధర కేవలం రూ. 4200 గా ఉండేది. 2010 నాటికి బంగారం ధర రూ. 18,500 లకు పెరిగింది. ఆ తరువాత 2015 వరకు 26,300 మాత్రమే పలికిన బంగారం ధరకు ఆ తరువాత రెక్కలొచ్చాయి. అమాంతం కొండెక్కింది. 2020 లో రూ. 48,650 కు చేరింది. అప్పట్లో అదే ఎక్కువ ధర కావడంతో కొనుగోలుదారులు షాక్ అయ్యారు. బంగారం ధరలు ఇంతకంటే ఎక్కువ ఇంకేం పెరుగుతాయిలే అని ఇంకొందరు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ ఐదేళ్లలో బంగారం ధర దాదాపు డబల్ అయిపోయింది. రెండేళ్ల క్రితం కూడా 65,000 గా బంగారం ధర ఇప్పుడు లక్షణంగా లక్ష రూపాయలకు చేరుకుంది.
బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కో ఔన్స్ కు 3,419 డాలర్లు పలుకుతోంది. ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 2 లక్షల 91 వేల 905 రూపాయలు. ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం 31 గ్రాముల 1 మిల్లీ గ్రాముకు సమానం. అంటే 3 తులాలకన్నా ఒక గ్రాము ఎక్కువే ఉంటుంది. అక్కడ ఔన్స్ బంగారం ధర పెరిగే కొద్ది ఇక్కడ ఇండియాలో బంగారం ధర పెరుగుతుంది.
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల ప్రకారం త్వరలోనే బంగారం ధరలు ఒక ఔన్స్ కు 3,700 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా మొదలైన టారిఫ్ వార్ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఔన్స్ బంగారం ధర . 4,500 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. అంటే ఔన్స్ బంగారం ధర మరో 1100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఇండియాలో తులం బంగారం ధరలు ఈజీగా లక్షన్నర మార్క్ తాకడం గ్యారెంటీ అని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బంగారం కొనడం, బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం అవుతుందా లేదా అనేది ఇక ఇప్పుడు మీరే ఆలోచించుకోండి.