18% GST on UPI Payments: బ్యాడ్ న్యూస్ రాబోతోందా? యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ చార్జ్ చేస్తారా?
GST on UPI payments : యూపీఐ చెల్లింపులపై ఇకపై జీఎస్టీ విధిస్తారనే వార్తలు యూపీఐ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి

GST on UPI payments : యూపీఐ పేమెంట్స్ లేకుండా రోజును ఊహించుకునే పరిస్థితి లేదు. కిరాణ దుకాణం నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడికి వెళ్లినా యూపీఐ పేమెంట్స్ చేయడం జనానికి అలవాటైపోయింది. పెద్ద నోట్ల రద్దు (డిమానిటైజేషన్) తరువాత ఏటీఎంలో క్యాష్ కొరత ఏర్పడటంతో యూపీఐ యాప్స్ వినియోగం మరీ ఎక్కువైంది. యూపీఐ పేమెంట్స్ ఉచితం అవడం అనేది కూడా యూపీఐ వినియోగం పెరగడానికి మరో కారణమైంది.
పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, భారత్ పే, భీమ్... ఇలా ఎన్నో యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. జేబులో రూపాయి లేకున్నా... ఎకౌంట్లో డబ్బులు ఉంటే చాలు.. చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తాల వరకు యూపీఐ పేమెంట్స్ ఎప్పుడో సర్వసాధారణం అయ్యాయి.
అయితే, యూపీఐ పేమెంట్స్ చేసే వారికి షాకింగ్ న్యూస్ రానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న యూపీఐ చెల్లింపులపై ఇకపై జీఎస్టీ విధిస్తారనే వార్తలు వస్తుండటమే. ఔను, రూ. 2000 పైగా చేసే యూపీఐ పేమెంట్స్‌పై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూపీఐ పేమెంట్స్ పై జీఎస్టీ విధించే అవకాశాలు కూడా తక్కువే అని ఇంకొంమంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయమై మిరా మనీ కో-ఫౌండర్ ఆనంద్ కే రథి మాట్లాడుతూ యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ చార్జ్ వసూలు చేసే అవకాశాలు లేవని అన్నారు. కాకపోతే యూపీఐ సేవలు అందిస్తున్న ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి సంస్థలే ఇకపై సర్వీస్ చార్జ్ వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఆ సర్వీస్ ఛార్జ్ పై అదనంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి రావచ్చు అని ఆనంద్ రథి అన్నారు.