Petrol Pump: పెట్రోల్‌పంపు లైసెన్స్ ఎలా పొందాలి.. ఖర్చెంత.. ఆదాయం ఎంత..?
Petrol Pump: భారతదేశంలో పెట్రోల్-డీజిల్‌కు చాలా డిమాండ్ ఉంది. అందుకే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు.
Petrol Pump: భారతదేశంలో పెట్రోల్-డీజిల్‌కు చాలా డిమాండ్ ఉంది. అందుకే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్రోల్ పంపును ఓపెన్ చేయవచ్చు. పెట్రోల్ పంపు వ్యాపారం లాభదాయకమైన వ్యాపారంగా చెప్పవచ్చు. IOCL, BPCL, HPCL, ఎస్సార్, రిలయన్స్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు భారతదేశంలోని పెట్రోల్ పంపుల కోసం లైసెన్స్‌లను జారీ చేస్తాయి. 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా పెట్రోల్ పంప్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ పంప్ తెరవాలనుకుంటే లైసెన్స్ కోసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పట్టణ ప్రాంతంలో పెట్రోల్ పంప్ తెరవాలనుకుంటే ఆ వ్యక్తి 12వ తరగతి పాస్ అయి ఉండాలి.
పెట్రోల్ పంపు పెట్టుబడి
మీడియా కథనాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పంప్ తెరవడానికి దాదాపు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు పట్టణ ప్రాంతంలో పెట్రోల్ పంప్ తెరవాలనుకుంటే రూ.30-35 లక్షలు పెట్టుబడి పెట్టాలి. IndianOil వెబ్‌సైట్ ప్రకారం.. ఫీల్డ్ టీమ్ చేసిన పరిశోధన ఆధారంగా కంపెనీ ఏ ప్రదేశంలోనైనా రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తుంది. ఆ స్థలం వ్యాపారానికి మంచిదని తేలితే మార్కెటింగ్ ప్లాన్‌లో చేర్చబడుతుంది. మీరు ఇండియన్ ఆయిల్ www.iocl.com అధికారిక వెబ్‌సైట్‌లో పెట్రోల్ పంప్ తెరవడానికి సంబంధించిన మార్గదర్శకాలను చూడవచ్చు.
పెట్రోల్ పంపుకు భూమి అవసరం
పెట్రోల్ పంపు తెరవాలంటే జాతీయ రహదారిపై కనీసం 1200 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ పంపు తెరవడానికి 800 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. ఒకవేళ దరఖాస్తుదారుడి పేరు మీద భూమి లేకుంటే ఆ భూమిని ఎక్కువ కాలం లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోలియం కంపెనీ కొత్త ప్రాంతంలో పెట్రోల్ పంపును తెరవాలనుకుంటే వార్తాపత్రికలలో, అధికారిక వెబ్‌సైట్‌లో దీని కోసం ప్రకటనలు ఇస్తారు. ఇందులో లాటరీ విధానాన్ని ఉపయోగిస్తారు. పెట్రోల్, డీజిల్ అమ్మకంపై కమీషన్ గురించి మాట్లాడితే ఒక్కో కంపెనీ ఒక్కో శాతం కమీషన్ ఇస్తుంది. ప్రతి పెట్రోల్ పంప్ డీలర్ లీటర్ పెట్రోల్‌పై సగటున రెండున్నర నుంచి మూడు రూపాయల వరకు లాభం పొందుతున్నాడు.