
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10గ్రాముల బంగారం ధర లక్ష దాటేసింది. తులం కాదు గ్రాము బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్ల సీజన్ కావడం..బంగారం ధర భారీగా పెరగడం సామాన్యులను తీవ్రంగా కలచివేస్తోంది. అటు లోహాల ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరిగే మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలోనూ 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా లక్షను తాకింది. 2025 ఆగస్టు కాంట్రాక్టు ధర గరిష్టంగా రూ. 1,00,000కు చేరుకుంది. మంగళవారం రాత్రి 11.30గంటల సమయానికి రూ. 98,069 వద్ద ట్రేడ్ అవుతుంది. జూన్ కాంట్రాక్టు రూ. 98,753 వద్ద ప్రారంభమైనా..కాస్త తగ్గి రూ. 97,415 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.
ఎంసీఎక్స్ లో బంగారం ట్రేడింగ్ 2003 నవంబర్ లో ప్రారంభం అయ్యింది. అప్పుడు 10 గ్రాముల ధర రూ. 5,858కాగా ఇప్పుడు రూ. లక్షను తాకింది. అంటే 21ఏళ్లలో బంగారం ధర 17 రెట్ల పెరిగింది. 10 గ్రాముల బంగారం 2008లో రూ.10,000కు , 2011లో రూ. 20,000కు, 2020లో రూ.40,000కు, 2022 ఏప్రిల్ లో రూ. 51,999కు, 2023లో రూ. 60,299కు చేరుకుంది. 2024లో రూ. 70,511దగ్గర ఉంది. అంటే బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి ఏడాది వ్యవధిలో 41శాతం ప్రతిఫలం లభించింది.