Stock Market : రికార్డుల మోత మోగిస్తున్న బ్యాంకింగ్ రంగం.. స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట

Stock Market : రికార్డుల మోత మోగిస్తున్న బ్యాంకింగ్ రంగం.. స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. అంతర్జాతీయంగా కాస్త తటపటాయింపు ఉన్నప్పటికీ, మన మార్కెట్ మాత్రం దూకుడు మీదుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజాలు కొనుగోళ్ల మద్దతుతో దూసుకుపోతుండటంతో బ్యాంక్ నిఫ్టీ సరికొత్త శిఖరాలను తాకింది. టారిఫ్ టెన్షన్ తగ్గిపోవడం కూడా మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. ఉదయాన్నే సెన్సెక్స్ భారీ లాభాలతో మొదలుకాగా, నిఫ్టీ కూడా 23,900 మార్క్‌ను దాటేసింది.
ఉదయం 9:25 సమయానికి, సెన్సెక్స్ ఏకంగా 428 పాయింట్ల లాభంతో 79,008 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 113 పాయింట్లు లాభపడి 23,955 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అయితే, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతీ షేర్లు మాత్రం స్వల్పంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ప్రపంచ మార్కెట్ల పరిస్థితి
అమెరికా మార్కెట్లు ముగిసిన ట్రేడింగ్ సెషన్‌లో భిన్నంగా ముగిశాయి. డోజోన్స్ 1.33 శాతం, నాస్‌డాక్ 0.13 శాతం నష్టపోగా, ఎస్‌అండ్‌పీ 500 సూచీ మాత్రం 0.13 శాతం లాభంతో క్లోజ్ అయింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 0.78 శాతం, హాంగ్‌కాంగ్ 1.61 శాతం, షాంఘై 0.33 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కానీ జపాన్ నిక్కీ మాత్రం 1.24 శాతం నష్టంతో కదులుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 66.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,392 డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) చివరి ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 4,668 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 2,006 కోట్ల షేర్లను విక్రయించారు.