దేశంలో 61% మంది పురుషుల వద్ద మొబైల్స్.. కానీ మహిళల సంఖ్య తెలిస్తే షాక్..!
*దేశంలో 61% మంది పురుషుల వద్ద మొబైల్స్.. కానీ మహిళల సంఖ్య తెలిస్తే షాక్..!
Oxfam Report: డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మహిళల కంటే పురుషులే ముందున్నారు. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం దేశంలో 61 శాతం మంది పురుషులు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. దేశంలో కేవలం 31 శాతం మంది మహిళలకు మాత్రమే మొబైల్స్ ఉన్నాయి. భారతదేశ అసమానత నివేదిక 2022లో కులం, తరగతి ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం పరిధి గురించి తెలిపారు.
సాధారణ కేటగిరీతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాల్లో 1 శాతం కంటే తక్కువ, షెడ్యూల్డ్ తెగల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లను వినియోగిస్తున్నారు. ఇది మాత్రమే కాదు నిరుద్యోగుల మధ్య వ్యత్యాసం కూడా స్పష్టంగా తేల్చారు. 95 శాతం శాశ్వత వేతన కార్మికులకు మొబైల్ ఉంటే, మొబైల్ సౌకర్యం లేని నిరుద్యోగుల్లో 50 శాతం మంది ఉన్నారు. నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరికరాల వినియోగం తగ్గింది. కరోనాకి ముందు దాదాపు 3 శాతం మందికి కంప్యూటర్ ఉండేది. కానీ 2021లో ఈ సంఖ్య కేవలం 1 శాతం మాత్రమే ఉంది.
సెప్టెంబర్ 2020 లో లాక్డౌన్ సమయంలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ర్యాపిడ్ అసెస్‌మెంట్ సర్వే నిర్వహించింది. 82 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు డిజిటల్ విద్యను అవలంబించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారని సర్వే వెల్లడించింది. ప్రయివేటు పాఠశాలల్లో సిగ్నల్ ఇంటర్నెట్ స్పీడ్ అతిపెద్ద సమస్యగా మారింది. లాక్‌డౌన్ సమయంలో పిల్లలకు చదువు చెప్పలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారని నివేదిక పేర్కొంది. 84 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పరికరాలు, ఇంటర్నెట్ కొరత కారణంగా డిజిటల్ మాధ్యమం ద్వారా పిల్లలకు చదువు చెప్పేందుకు ఇబ్బందులు పడినట్లు తెలిపారు.