Tsrtc strike : సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్టీసీ
-47వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె -నేడు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల భేటీ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు సమావేశంకానున్నారు. అనంతరం సమ్మెపై తుది నిర్ణయం తీసుకోనున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మరోవైపు ఆర్టీసీ ప్రైవేట్ రూట్ల పర్మిట్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కార్మికుల ఆత్మహత్యలు, జీతభత్యాల పిటిషన్లపై కూడా హై కోర్టు విచారించనుంది. నేడు ఉదయం పదిన్నర గంటలకు ఆర్టీసీ ఎన్‌ఎంయూ అత్యవసర భేటీ కానుంది. తాజా పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కార్మిక సంఘాల జేఏసీ సందిగ్ధంలో పడింది. కేసు లేబర్ కోర్టుకుచేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో నిన్న జేఏసీ ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. హైకోర్టు ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి ఇవాళ న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
46 రోజులపాటు ఉధృతంగా సమ్మె కొనసాగించినా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇప్పటికే రెండు నెలలపాటు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని పెద్ద సంఖ్యలో కార్మికులు అభిప్రాయపడ్డారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.