VinFast VF7 and VF9 SUVs: వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ద్వారా భారత్‌లోకి ప్రవేశించబోతోంది. సంస్థ తన ఎంట్రీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. సోషల్ మీడియాలో కంపెనీ షేర్ చేసిన టీజర్‌లో, 5-సీటర్ VF7 , 7-సీటర్ VF9 గ్లింప్స్ చూడవచ్చు. VinFast భారతీయ మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురాబోతోంది.
కంపెనీ SUVలకే పరిమితం కాలేదు. బ్యాటరీ ఎలక్ట్రిక్ SUV కాకుండా, కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ సైకిల్ కోసం డిజైన్‌ను కూడా పేటెంట్ చేసింది. దాని గ్లోబల్ మోడల్స్‌లో ఒకటైన VF e34 ను ఇటీవలే భారతీయ రోడ్లపై పరీక్షించడం తెలిసిందే. అయితే ఈ మోడల్ కొత్త టీజర్‌లో కనిపించలేదు. అయినప్పటికీ, ఇది VF7, VF9 లతో పాటు ప్రదర్శించనుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం జనవరి 17 నుండి ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమవుతుంది.
విన్‌ఫాస్ట్ గతంలో భారతదేశం, ఇండోనేషియా రెండింటిలోనూ ఉత్పత్తి ప్లాంట్‌లను ఏర్పాటు చేసే ప్రణాళికలను వెల్లడించింది. VinFast మొదటి ఐదేళ్లలో $500 మిలియన్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు ప్రభుత్వంతో ఉమ్మడి ఒప్పందం కూడా చేసుకుంది. కంపెనీ ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే బ్యాటరీ ప్లాంట్, తయారీ సౌకర్యాల ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రాష్ట్రానికి 3,500 ఉద్యోగాలు కూడా వస్తాయి. వచ్చే 3 సంవత్సరాలలో ఈ రెండు దేశాల్లో EV ఉత్పత్తి ప్రారంభం కావాలి.
VinFast VF7 Features
VF7 అనేది 75.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఆల్-ఎలక్ట్రిక్ 5-సీటర్ SUV. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450కిమీల రేంజ్‌ను అందిస్తుంది. వేరియంట్‌పై ఆధారపడి, VF7 సింగిల్ లేదా డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఇక్కడ మునుపటిది ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో 201 Bhp, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ మోటార్ సెటప్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌లతో వస్తుంది. ఇది 348 Bhp, 500 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు వేరియంట్లలో బ్యాటరీ ప్యాక్ ఒకే విధంగా ఉంటుంది. సింగిల్ మోటారు సింగిల్ ఛార్జ్‌పై 450 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. డ్యూయల్ మోటారు 431 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారులో 15-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంది. ఇది Level-2 ADAS సూట్‌తో వస్తుంది.
VinFast VF9 Features
VF9 అనేది 3-వరుసల ఎలక్ట్రిక్ MPV. ఇది 7 మంది వరకు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో 123 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది బేస్ ECO వేరియంట్ కోసం 531Km, PLUS వేరియంట్ కోసం 468Km సింగిల్-ఛార్జ్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇది 6-సీటర్ కాన్ఫిగరేషన్‌లో కూడా ఉంటుంది. SUV రెండు వేరియంట్‌లలో AWD స్టాండర్డ్‌గా డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది 402 బిహెచ్‌పి, 620 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 200కిమీ/గం వేగంతో దూసుకెళ్తుంది. విన్‌ఫాస్ట్ 6.6 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది.