Akshaya Tritiya 2025: అక్షయ తృతియ పూజ ముహూర్తం... ఆ రోజు బంగారం కొనడానికి కారణం?

Akshaya Tritiya 2025: అక్షయ తృతియ పూజ ముహూర్తం... ఆ రోజు బంగారం కొనడానికి కారణం?
Akshaya Tritiya 2025 Date, Time and Puja Muhurat: అక్షయ తృతియ... దేశంలో ఉన్న హిందువులు సెలబ్రేట్ చేసుకునే పండగల్లో ఇది కూడా ఒకటి. అక్షయ తృతియ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ఆ రోజు బంగారం కొంటే బాగా కలిసొస్తుందని బలంగా నమ్ముతారు. బంగారం కొనలేని వారు ఇంట్లోకి ఇంకేదైనా వస్తుసామాగ్రి కొంటుంటారు. మొత్తానికి ఏది కొనుగోలు చేసినా అది ఇంట్లోకి శుభాన్ని తీసుకొస్తుందనేది కొంతమంది నమ్మకం.
ఈ ఏడాది అక్షయ తృతియ ఏప్రిల్ 30 బుధవారం నాడు వస్తోంది. హిందువుల క్యాలెండర్ ప్రకారం చూస్తే, వైశాఖ మాసం శుక్ల పక్షమి మూడో రోజున అక్షయ తృతియ సెలబ్రేట్ చేసుకుంటారు. అక్షయ తృతియ అనే పదంలో అక్షయ అంటే అనంతమైనది అని అర్థం. ఇక తృతియ అనే పదం మూడో రోజును సూచిస్తుంది. అందుకే ఆ రోజు కొనుగోలు చేసిన వస్తువైనా, లేక ఆ రోజు పెట్టిన పెట్టుబడి అయినా అనంతమైన లాభాలను తీసుకొస్తుందనేది భక్తుల విశ్వాసం.
ఈసారి అక్షయ తృతియ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? పూజా ముహూర్తం ఎప్పుడు?
అక్షయ తృతియ తిథి ఏప్రిల్ 29, 2025 సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభం అవుతుంది.
అక్షయ తృతియ తిథి ఏప్రిల్ 30, 2025 మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది.
అక్షయ తృతియ పూజా ముహూర్తం సమయం : ఏప్రిల్ 30, 2025 - తెల్లవారుజామున 05.40 గంటల నుండి మధ్యాహ్నం 12.18 గంటల వరకు.
అక్షయ తృతియకు ఎందుకు అంత ప్రాధాన్యత?
మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అక్షయ తృతియ రోజు బంగారం లేదా ఇతర ప్రాపర్టీలు ఏవైనా కొంటే అవి అదృష్టాన్ని తీసుకొస్తాయనేది బలమైన నమ్మకం. ఇక సెంటిమెంట్ విషయాన్ని కాసేపు పక్కనపెడితే, త్రేతా యుగం కూడా అక్షయ తృతియ నాడే ఆరంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అక్షయ తృతియ నాడే మహర్షి వేద వ్యాసుడు గణపతికి మహా భారతం చెప్పడం మొదలుపెట్టినట్లు పురాణాల్లో ఉంది.
పురాణాలు ప్రకారం శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు సుధామను కలిసింది కూడా అక్షయ తృతియ నాడే. ఆ గంగాదేవి భువిపై కాలు పెట్టింది కూడా అక్షయ తృతియ నాడేనని చెబుతుంటారు. ఇలా పురాణ ఇతిహాసాల్లో అక్షయ తృతియకు అనేక విధాలుగా భారీ ప్రాధాన్యత ఉంది.