జగన్‌ ఆదా స్ఫూర్తికే రివర్స్‌ టెండర్‌ వేసిన ఆ ఘనులెవరు?

Update: 2020-06-16 11:43 GMT

నిధులను ఆదా చేసేందుకు వైసిపి ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలుకుని అన్నింటా రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేస్తున్నారు. అయితే సీఎం సొంత జిల్లా కడపలో మాత్రం, రివర్స్‌ టెండరింగ్‌ స్ఫూర్తికే రివర్స్‌ గేర్‌ వేసేస్తున్నారట కొంతమంది నేతలు. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధుల్లో పర్సెంటేజీలు పంచుకోవడానికి, దిమ్మతిరిగే ఎత్తుగడలు వేస్తూ, అధిష్టానానికే బొమ్మ చూపిస్తున్నారట. పంచుకోవడంలో అంతగా పండిపోయిన, ఆ నేతల మితిమీరిన తెలివితేటలు ఎలా వున్నాయో తెలుసా...?

కడప కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది. మెరుగైన తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, బీటీ రోడ్లు తదితర నిర్మాణాలకు వెచ్చించాల్సి ఉంది. కార్పొరేషన్‌ పరిధిలో 32 కోట్ల 46 లక్షల వ్యయంతో 221 పనులను చేపట్టాలని అంచనాలు రూపొందించారు. ఇందులో పైప్‌లైను, డ్రైనేజీ, కల్వర్టులు, అంతర్గత రహదారులు తదితర పనులను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 5న టెండర్లను ఆహ్వానించారు. ఒక్కోపని అంచనా వ్యయం 5 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉంది. అయితే 14వ ఆర్థిక సంఘం నిధులపై నగరానికి చెందిన ఇద్దరు కీలక నేతలు కన్నేసినట్లు మాట్లాడుకుంటున్నారు. టెండరు నిర్వహిస్తే కాంట్రాక్టర్లు పోటీపడి లెస్‌కు దాఖలు చేస్తారు. దీనివల్ల మాకేంటి అని ఆ కొందరు అనుకున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లను రింగ్‌ చేసి పర్సెంటేజీలు ఇచ్చిన వారికే పనులు కేటాయిస్తే లాభమని భావించి, ఆ దిశగా రంగంలోకి దిగినట్లు సమాచారం. కడపకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి, మీరెవరూ పోటీ పడి లెస్‌లకు టెండరు వేయకండి. మీ అందరికీ పనులు వచ్చేలా చూస్తాం పర్సెంటేజీలు మాత్రం మాకు ఇవ్వాలని సమావేశంలో చెప్పినట్లు వినికిడి. ఆన్‌లైన్‌ టెండర్లే కదా బయటి వ్యక్తులు ఎవరైనా లెస్‌కు టెండరు దాఖలు చేస్తే ఇబ్బంది కదా అని కొందరు కాంట్రాక్టర్లు సందేహం వ్యక్తం చేయగా, బయటి వ్యక్తులు వచ్చి ఇక్కడ పనులు చేయడం అంత ఈజీ కాదంటూ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒకవేళ మనం చెప్పినా వినకుండా టెండరు వేస్తే ఎలా రద్దు చేయాలో మనకు తెలుసు, ఒకవేళ వేసినా రకరకాల అడ్డంకులు సృష్టిస్తాం. టెండరు ఎవరూ వేయకుండా మేం చూస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. కడప కార్పొరేషన్‌లో 120 మంది వరకు రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఉండగా, ఆ సమావేశానికి 20 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. పోటీ లేకుండా చేస్తే పర్సెంటేజీలు ఇచ్చే డీల్‌కు కాంట్రాక్టర్లు ఒకే అనడంతో ఎవరెవరికి ఎన్నెన్ని పనులు కేటాయించాలో తేల్చేందుకు పలువురు మాజీలతో కమిటీగా ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి ఎన్ని పనులు కేటాయించాలన్నదానిపై జాబితా తయారు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం సూచించిన వాటికే ఖర్చు చేయాల్సి ఉంది. అయితే సుమారు 6 కోట్లను నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో పనులు చేపట్టేందుకు కేటాయించారు. 18 పనులు గుర్తించి టెండర్లను ఆహ్వానించారు. ఈ పనులకు సంబంధించి 8 శాతం పర్సెంటేజీ ఇచ్చేలా ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక సంఘం నిధులను నాడు-నేడు పనులకు ఉపయోగించకూడదని అభ్యంతరాలు రావడంతో రద్దు చేశారు. ఇప్పుడు చేపట్టబోయే పనుల్లో 10 నుంచి 12 శాతం పర్సెంటేజీలు ఇచ్చేలా కాంట్రాక్టర్లతో ఆ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పర్సెంటేజీల డీల్‌ ఖరారైతే టెండర్ల ప్రక్రియ నామమాత్రంగా ఉంటుంది. ఎందుకంటే గతంలోలాగా 30 శాతం లెస్‌కు కాంట్రాక్టర్లు పోటీ పడి టెండర్లు వేయరని చెబుతున్నారు.

మొత్తానికైతే రాష్ట్రమంతా రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలవుతుంటే, కడపలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఖజానాకు ఆదా చేద్దామని సీఎం జగన్‌ ఆలోచిస్తుంటే, కడప జిల్లా నేతలు మాత్రం రివర్స్‌కే రివర్స్‌ గేర్‌ వేసి, ఖజానాకు కన్నంవేసి, దండుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News