ఏపీలో ఇప్పుడే వలసల వరదకు గేట్లెత్తడంలో జగన్‌ వ్యూహమేంటి?

Update: 2020-06-13 10:42 GMT

కరోనాతో ఎక్కడివారక్కడే అయిన టైంలో, ఆంధ్రప్రదేశ్‌లో సడెన్‌గా వలస రాజకీయం ఊపందుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిక కీలక టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవ రావు, వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతకీ వైసీపీ అధిష్టానమే శిద్దాను ఆహ్వానించిందా? వద్దువద్దంటున్నా ఆయనే వైసీపీ గూటికి చేరారా? మొన్నటి వరకు సైకిల్‌పై జాలీగా తిరిగిన శిద్దా, ఫ్యాన్‌ చెంతకు చేరడానికి కారణమేంటి? ప్రకాశంలో ఇంకెంతమంది లీడర్లు ఫ్యాన్‌ గాలి కావాలంటున్నారు?

ప్రకాశం జిల్లా తెలుగుదేశానికి పెద్ద దిక్కు మాజీ మంత్రి శిద్దారాఘవ రావు. గ్రానైట్‌ వ్యాపారంలో కాకలు తీరిన శిద్దా, జిల్లాలో టీడీపీ కార్యక్రమం ఏది జరిగినా పూర్తిస్థాయిలో ఫండింగ్ చేసేవారట. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సైతం ఆర్థిక అండదండాలు అందించేవారట. అందుకే 2014లో దర్శి నుంచి గెలిచిన శిద్దాకు, కేబినెట్‌లో స్థానం కల్పించారు చంద్రబాబు. అలా ప్రకాశం జిల్లాకు కీలకంగా వున్న శిద్దా రాఘవరావు, కుటుంబ సమేతంగా తెలుగుదేశానికి గుడ్‌ బై చెప్పి, వైసీపీ కండువా కప్పుకోవడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చంద్రబాబుకు నమ్మినబంటుగా పేరున్న శిద్దా రాఘవరావు, ఆల్‌ఆఫ్ సడెన్‌గా వైసీపీ తీర్థం పుచ్చుకోవడమేంటన్నదానిపై అనేక రకాల చర్చ జరుగుతోంది. అయితే, ఇదంతా హఠాత్తేమీకాదని, ఎప్పటి నుంచో శిద్దాపై ఒత్తిడి పెరుగుతోందన్న మాటలూ వినిపిస్తున్నాయి. శిద్దా కుటుంబానికి ప్రకాశం జిల్లాలో మైనింగ్‌‌ వ్యాపారముంది. అయితే, శిద్దా కపెంనీలకు వైసీపీ ప్రభుత్వం మైనింగ్‌ అనుమతులు ఇవ్వకుండా, ఆర్థికంగా దెబ్బతీస్తోందని టీడీపీ నేతలంటున్నారు. ఏడాది కాలంగా క్వారీల్లో పనుల్లేక దాదాపు 70 కోట్లు నష్టపోయారని చెబుతున్నారు. పార్టీ మారాలన్న ఒత్తిడితోనే ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిందని వారంటున్నారు. అందుకే మొదట్లోనే శిద్దా రాఘవ రావు సోదరుడు వెంకటేశ్వరరావు వైసీపీలో చేరిపోయారట. వీలైనంత త్వరగా వైసీపీలోకి రావాలంటూ బ్రదర్‌ ఒత్తిడి చేస్తున్నారట. అందుకే మరో సోదరుడు నాగేశ్వర రావు, కుమారుడు సుధీర్‌తో కలిసి, వైసీపీ కండువా కప్పుకున్నారని టీడీపీ నేతలంటున్నారు. వ్యాపార లావాదేవీల కారణంగానే శిద్దా పార్టీ మారారన్నది టీడీపీ లీడర్లు మాట.

కేవలం వ్యాపారలావాదేవీలే కాదు, తెలుగుదేశంలో తనకు ఎదురైన అనుభవాలతోనూ మనస్తాపం చెందిన శిద్దా, పార్టీ మారారని అనుచరులు మాట్లాడుకుంటున్నారు. టీడీపీలో సీనియర్‌ నేతగా, దర్శి నియోజకవర్గంలో మంచి నాయకుడు గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావుని, 2019 ఎన్నికల్లో టీడీపీ చాలా ఇబ్బందులకు గురిచేసిందని అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా బలవంతంగా పోటీ చేయించి, ఓటమికి కారణమైందని, శిద్దా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇలా పార్టీలో అవమానాలు ఎదురవడం, కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే శిద్దా పార్టీ మారారని మాట్లాడుకుంటున్నారు.

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, వైసీపీలో నేరుగా చేరకపోయినా, వైసీపీకి మద్దతిచ్చి, తన తనయడు వెంకటేష్‌ని పార్టీలో చేర్పించారు. అంతేకాదు, శిద్దా వైసీపీలో చేరిన రోజే, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కరణం. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందన్నారు. పార్టీ మారేందుకు ఎవరికి వారు వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు కరణం.

అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, పర్చూరు శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు సైతం, వైసీపీలో రేపోమాపో చేరబోతున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రకాశం జిల్లాలో వైసీపీ వలసలు, తెలుగుదేశంలో కలవరాన్ని పెంచుతున్నాయి. మున్ముందు మిగతా జిల్లాల్లోనూ భారీ ఎత్తున చేరికలుంటాయని, వైసీపీ నేతలు సంకేతాలిస్తున్నారు.

Tags:    

Similar News