టీడీపీలో టెన్షన్‌ రేపుతున్న ఆ నెక్ట్స్‌ ఎవరు?

Update: 2020-06-16 06:32 GMT

గుండె వేగం బుల్లెట్‌ స్పీడందుకుంటోంది. ఎడమ కన్ను అదేపనిగా అదురుతోంది. ప్రతిమాటా అపశకునంలా ధ్వనిస్తోంది. మనసు మనసులో లేదు. చూస్తున్న ఘటనలు, చూడబోతున్న భవిష్యత్‌కు ట్రైలర్‌లా‌ భయపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నెక్ట్స్‌ ఎవరు అన్న మాట తూటాలా వెంటాడుతోందట. ఇంతకీ ఎందుకీ కలవరింత? ఎవరిలో ఈ పలవరింత?

అచ్చెన్నాయుడు రిమాండ్ అయ్యారు, జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్టయ్యారు, మరి నెక్ట్స్ ఎవరు? తెలుగుదేశంలో గుబులు రేపుతున్న అరెస్టుల పర్వం. తర్వాత ఎవరు అంటూ లీడర్ల అనుచరుల్లో ఆందోళన. ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుల రాజకీయం కాక రేపుతోంది. అయితే, వరుసగా కీలక నాయకుల అరెస్టులు తెలుగుదేశం శిబిరంలో ఆందోళన పెంచుతున్నాయన్న చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌‌, టీడీపీ కార్యకర్తల్లో మరింత గుబులు రేపుతోంది. అచ్చెన్న, ఉమ, యనమల, కాల్వ, పరిటాల, నారాయణ, ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60 శాతం పెదబాబు, చినబాబులకు ముడుపులుగా వెళ్లాయని విజయసాయి ఆరోపించారు. విజయసాయి తన ట్వీట్‌లో ప్రస్తావించిన నాయకుల పేర్లు, వారివారి అనుచరులకు ఆందోళన కలిగిస్తున్నాయట. నెక్ట్స్ ఎవరు అన్న టెన్షన్‌ పెరుగుతున్న నేపథ్యంలో, విజయసాయి సదరు నేతలపై సాధారణ ఆరోపణలు చేశారా లేదంటే హింట్‌ ఇచ్చారా అన్నది తెలుగు తమ్ముళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. అరెస్టులు అక్రమం అంటూ ఆందోళనలు చేస్తున్నాయి. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి నెక్ట్స్ ఎవరు అన్న ఫోబియా తెలుగుదేశంలో కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు నేతల ఫాలోవర్స్ టెన్షన్‌ పడుతుండగా, మరోవైపు అధైర్యపడొద్దని పార్టీ అధినేత చంద్రబాబు ధైర్యం నూరిపోస్తున్నారు. మరింత ధాటిగా ఉద్యమం చేద్దామని పిలుపునిస్తూ, కార్యకర్తలకు భరోసాఇస్తున్నారు. 

Tags:    

Similar News