ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పార్టీని వీడారు. దాంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులను నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. దర్శి నియోజకవర్గం టీడీపీ దాదాపు ఖాళీ అయింది. 2014 లో కేవలం వెయ్యి ఓట్లతో గెలిచిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. దీనికి కారణం స్వయంకృతాపరాధమే అని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
2014 లో టీడీపీ తరుపున మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పోటీచేసి గెలిచారు. అయితే 2019 మాత్రం ఆయనకు కాదని ఎక్కడో కనిగిరి నుంచి వచ్చిన కదిరి బాబురావుకు సీటు ఇచ్చారు. దాంతో శిద్ధా రాఘవరావు పార్లమెంటుకు పోటీ చేయవలసి వచ్చింది. ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగిన శిద్దా బలమైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అంతేకాదు దర్శిలో పోటీ చేసిన కదిరి బాబురావు సైతం ఓడిపోయారు. నిజానికి కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న కదిరికి దర్శి కొత్తేమి కాకపోయినా జగన్ చరిష్మా, ప్రచారానికి తక్కువ సమయం ఉండటం, స్థానికంగా పట్టు లేకపోవడం,
అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్ మీద సానుభూతి ఉండటం వంటివి ఓటమికి కారణమని టీడీపీ కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. 2014 లో ఇచ్చినట్టే కనిగిరిలో కదిరికి, దర్శిలో శిద్ధా కు టిక్కెట్ ఇచ్చి ఉంటే గెలుపు కాకపోయినా మెజారిటీని తగ్గించి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఇక్కడ టీడీపీ రుచించని విషయం మరొకటి కూడా ఉంది. సొంత నియోజకవర్గాల్లో కాకుండా వేరే చోట పోటీ చేసిన ఈ ఇద్దరు నాయకులు వైసీపీలో చేరడంతో ఆ పార్టీకి దర్శిలో నాయకత్వం కరువైంది.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు నియోజకవర్గ బాధ్యతల్ని ఇవ్వాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే ఒక వర్గం మాత్రం 2009 ఎన్నికల్లో పోటీ చేసిన మన్నం వెంకటరమణను తీసుకురావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కాని మన్నం వెంకట రమణ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి దర్శిలో టీడీపీ తన ఇంచార్జిని ప్రకటిస్తుందో లేదో చూడాలి.