రాజమండ్రిలో బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం
* రెంగు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు * ఇన్నీసుపేటకు చెందిన సత్తిరాజు అరెస్ట్ * తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిడ్నాప్‌నకు గురైన ఐదేళ్ల రోహిణి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. కేవలం రెండు గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు టూ టౌన్ పోలీసులు. నిందితుడు ఇన్నీసుపేటకు చెందిన సత్తిరాజును అరెస్ట్ చేశారు.
నిన్న ఇంటి ముందు ఆడుకుంటున్న రోహిణీకి చిప్స్ ప్యాకెట్ కొనిచ్చిన సత్తిరాజు కొద్దిసేపటి తర్వాత తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ తమ కూతురు కనిపించకపోవడంతో స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రోహిణీతో పాటు ఆడుకున్న చిన్నారులు ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
రోహిణీని పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం తీసుకొని వెళ్లి వదిలిపెట్టాడు కిడ్నాపర్. అక్కడి నుంచి ఒంటరిగా తిరిగి రాజమండ్రి వైపు బయల్దేరాడు. చిన్నారులు ఇచ్చిన సమాచారంతో కిడ్నాపర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సత్తిరాజు ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో రోహిణీని కనుగొని సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చారు. కిడ్నాప్‌నకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇన్నీసుపేటకు చెందిన సత్తిరాజుకు 17 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. ఇతనికి పిల్లలు లేరు. టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇని ఇస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. పిల్లలు లేరని పెంచుకోవడానికి కిడ్నాప్ చేశాడా లేక ఎవరికైనా అమ్మేయడానికి చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసును రెండు గంటల్లోనే ఛేదించిన పోలీసులను బాలిక తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.