జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం: సింగిల్ డిజిట్ నుంచి డిప్యూటీ సీఎం వరకు పవన్ ప్రస్థానం
Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్లు పూర్తైంది. 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో మార్చి 14న ఆ పార్టీ ఏర్పాటు చేసింది.

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం: సింగిల్ డిజిట్ నుంచి డిప్యూటీ సీఎం వరకు పవన్ ప్రస్థానం
Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్లు పూర్తైంది. 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో మార్చి 14న ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తొలిసారిగా జనసేన చేరింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ సభలో పాల్గొంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలోని మైలురాళ్లను ఒకసారి చూద్దాం.
జనసేన ఆవిర్భావం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ ఓ ప్రైవేట్ హోటల్ లో జనసేన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సోదరులు చిరంజీవి 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ప్రజారాజ్యం పార్టీకి అనుబంధ యువజన విభాగం యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేశారు.ఇది పవన్ కళ్యాణ్ కు నచ్చలేదు. ఈ కారణంతోనే పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు.
జనసేన ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు.
టీడీపీ, బీజేపీకి దూరమైన పవన్ కళ్యాణ్
2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో కేంద్రం హామీ ఇచ్చింది. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని అప్పట్లో ప్రకటించింది. అయితే ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు సర్కార్ తీసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడాన్ని పాచిపోయిన లడ్డూ ఇచ్చారని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఆందోళనలు నిర్వహించారు.ఇలా టీడీపీ, బీజేపీకి పవన్ కళ్యాణ్ దూరమయ్యారు.
లెఫ్ట్, బీఎస్పీతో జతకట్టిన జనసేన
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ విడివిడిగా పోటీ చేశాయి. సీపీఐ, సీపీఐఎం, బీఎస్పీలతో కలిసి జనసేన పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ స్థానంలో రాపాక వరప్రసాద్ జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రాపాక వరప్రసాద్ జగన్ కు జై కొట్టారు. 2019-2024 ఎన్నికల వరకు అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలపై ఆయన పోరాటం చేశారు. ఈ పోరాటంలో భాగంగా కొన్ని సమయాల్లో ఈ రెండు పార్టీల నాయకుల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి.
బీజేపీతో జత కట్టిన పవన్ కళ్యాణ్
2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్నాళ్లకే పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు గుడ్‌బై చెప్పారు. బీజేపీతో చేతులు కలిపారు. 2024 ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికలకు నాలుగేళ్ల ముందే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీతో జనసేన పొత్తుపై అప్పట్లో ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారు. పీఆర్‌పీ మాదిరిగానే జనసేనను కూడా విలీనం చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలను బద్దలు కొడుతూ అధికార పీఠాన్ని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.
టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీల ఓట్లు చీలకుండా ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ ప్రభుత్వ విధానాలపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేర్వేరుగా పోరాటాలు చేశారు. విశాఖలో పవన్ కళ్యాణ్ టూర్ ను అడ్డుకొన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. చిత్తూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై జనసేనాని అభ్యంతరం తెలిపారు.చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబును పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలులో పరామర్శించారు. జైలు బయట మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో కలిసి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అప్పటికే బీజేపీతో కూడా ఆయన మిత్రపక్షంగా ఉన్నారు. తమతో కలిసి బీజేపీ కూడా వస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ,జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసేందుకు బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు.
పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన గెలుపు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 11 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు అవకాశం దక్కింది. ఎన్ డీ ఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తుఫాన్ గా చెప్పారు.
తిరుపతి లడ్డు వివాదంతో సనాతన ధర్మం వైపు
జనసేన ఏర్పాటు చేసే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే లెఫ్ట్ భావజాలం కన్పించేది. చెగువేరాతో పాటు ఇతర లెఫ్ట్ పార్టీల నాయకుల గురించి అప్పుడప్పుడూ ఆయన ప్రస్తావించేవారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు తరిమెల నాగిరెడ్డి రాసిన తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని తాను చదివిన విషయాన్ని గతంలో ఆయన ఓ సందర్భంలో ప్రకటించారు. బీజేపీతో పొత్తు తర్వాత ఆర్ఎస్ఎస్ విధానాలను ఆయన పొగిడారు. బీజేపీ విధానాలను ఆకాశానికి ఎత్తారు. తిరుపతి లడ్డుకు ఉపయోగించిన నెయ్యి వివాదం సమయంలో సనాతన ధర్మ రక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ లడ్డు వివాదంపై ప్రాయశ్చిత దీక్ష చేశారు. గత నెలలో ఆయన దక్షిణాదిలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు.
గ్లాస్ పార్టీ 12వ సంవత్సరంలోకి ప్రవేశించింది. రాష్ట్రంలో పార్టీ పునాదిని పదిలం చేసుకుంటూ ముందుకు వెళ్లడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో జనసేనాని పిఠాపురం వేదికగా నిర్వహించే సభలో ప్రకటించనున్నారు.