అంతర్జాతీయ హోదా దక్కినా.. దశ మారని గన్నవరం ఎయిర్‌పోర్టు

Gannavaram Airport: ఈనెలలోనే ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ ప్రారంభం

Update: 2022-10-11 01:47 GMT

అంతర్జాతీయ హోదా దక్కినా.. దశ మారని గన్నవరం ఎయిర్‌పోర్టు

Gannavaram Airport: గ‌న్నవ‌రం విమానాశ్రయానికి అంత‌ర్జాతీయ హోదా ద‌క్కిన‌ప్పటికీ అంత‌ర్జాతీయ స్థాయిలో విమానాలు న‌డవడం లేదు. టీడీపీ హ‌యాంలో గ‌న్నవ‌రం ఎయిర్‌పోర్టు నుంచి అంత‌ర్జాతీయ విమానాలు సింగ‌పూర్, దుబాయిల‌కు నడిచాయి. అయితే మూడేళ్ల నుంచి అంత‌ర్జాతీయ స‌ర్వీసులు ప‌క్కన పెడితే కనీసం దేశీయ స‌ర్వీసులు కూడా పూర్తిస్థాయిలో త‌గ్గిపోయాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ అంత‌ర్జాతీయ స‌ర్వీసులు గ‌న్నవ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ఈనెలలోనే ప్రారంభం కావ‌డం శుభ‌ప‌రిణామంగా ప్రయాణికులు భావిస్తున్నారు.

గ‌న్నవ‌రం విమానాశ్రయం నుంచి మ‌ళ్లీ అంత‌ర్జాతీయ విమానాలు ఎగ‌ర‌నున్నాయి. ఈనెల 29 నుంచి బెజ‌వాడ - షార్జాకు అంత‌ర్జాతీయ విమానాన్ని ఎయిరిండియా సంస్థ న‌డ‌ప‌నుంది. వారానికి రెండు రోజుల‌పాటు ఈ స‌ర్వీసులు అందుబాటులో ఉండ‌నున్నాయ‌ని అధికారులు ఇప్పటికే ప్రక‌టించారు.

చానాళ్ల విరామం త‌ర్వాత అంత‌ర్జాతీయ హోదా ద‌క్కించుకున్న గ‌న్నవ‌రం విమానాశ్రయం నుంచి విదేశాల‌కు విమానాలు న‌డ‌ప‌డం ప‌ట్ల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారంలో ప్రతి శనివారం, సోమవారం విజయవాడ - షార్జాకు విమానం న‌డ‌వ‌నుంది. ఈనెల 29న మొదటి విమానం ప్రారంభం కానుంది. గతంలో విజయవాడ నుంచి ముంబయి, వారణాసిలకు నేరుగా న‌డిచాయి. వాటిని కూడా త్వర‌లో పునరుద్ధరించే దిశ‌గా అధికారులు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విజయవాడ - ఢిల్లీల మధ్య అదనంగా మరో విమానాన్ని న‌డ‌పాల‌ని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మూడేళ్ల క్రితం దేశంలోనే ఓ వెలుగు వెలిగిన గ‌న్నవ‌రం విమానాశ్రయం... కొంత‌కాలంగా డీలా ప‌డింది. ఇక్కడ నుంచి దుబాయి, సింగ‌పూర్, కాశీ, ముంబ‌యిలకు విమానాలను గ‌తంలో న‌డిపారు. ఇప్పుడు విజ‌య‌వాడ - హైద‌రాబాద్ స‌ర్వీసులు కూడా స‌గానికి ప‌డిపోయాయి. విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపే విషయంపై కనీసం దృష్టి సారించే వారే లేకుండా పోయారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు కూడా సరైన పర్యవేక్షణ లేక నత్తనడకన సాగుతున్నాయి. 2022 చివరికి భవనం పూర్తి చేసి వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. 450 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించ‌గా... ఇప్పటి వ‌ర‌కు 31 శాతం మాత్రమే ప‌నులు పూర్తయ్యాయి. వ‌చ్చే ఏడాది నాటికి పూర్తి స్థాయిలో ప‌నులు పూర్తి చేయాల‌ని ఇటీవ‌ల జరిగిన విమానాశ్రయ స‌మీక్ష స‌మావేశంలో తీర్మానించారు.

గ‌న్నవ‌రం విమానాశ్రయం నుంచి గ‌తంలో ప్రతి అరగంటకు ఒక విమానం చొప్పున దేశంలోని తొమ్మిది నగరాలకు రాకపోకలు సాగించేవి. ఢిల్లీ, ముంబయి, చెన్నయ్, బెంగళూరు, వారణాశి, హైదరాబాద్ విశాఖ, తిరుపతి, కడపకు ప్రతిరోజూ వెళ్లే సర్వీసులు కూడా ఇప్పుడు నడవడం లేదు. ముంబయి, వారణాశి లాంటి నగరాలకు పూర్తిగా ఆపేశారు. ఢిల్లీకి ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి మాత్రమే నడుపుతున్నారు. విదేశాల‌కు విమానాల‌ను న‌డపటం మున్నాళ్ల ముచ్చట‌గానే మారిపోయింది. అంత‌ర్జాతీయ హోదా ఇచ్చినా మ‌స్కట్ కు వెళ్లే స‌ర్వీసు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు తాజాగా దుబాయ్ స‌ర్వీసు కూడా చేర‌టంతో మ‌రిన్ని స‌ర్వీసులు పెరుగుతాయ‌ని ఆశాభావం వ్యక్తమవుతోంది.

గ‌న్నవ‌రం విమానాశ్రయం ప్రధానంగా ఐదు జిల్లాల వారికి అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి విదేశాల‌కు కూడా వెళ్లే ప్రయాణికులు, అక్కడ నివ‌సించే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. వీరంతా విదేశాల‌కు వెళ్లాలంటే హైద‌రాబాద్‌కు గానీ చెన్నయ్‌కి గానీ వెళ్లాల్సి వ‌స్తోంది. బెజ‌వాడ నుంచే నేరుగా విమానాలను అందుబాటులోకి తీసుకురావాల‌ని జిల్లా వాసులు కోరుతున్నారు.

Full View
Tags:    

Similar News