Srisailam: ఇన్నాళ్లూ కరోనాతో భయాందోళనలో పడ్డ కర్నూలు జిల్లా శ్రీశైలం వాసులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. క్రమంగా మండలంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం జనాలకు ఊరట కల్పించింది. కొవిడ్ కట్టడికి అధికారులు తీసుకున్న చర్యలతో పాటు ప్రజలు అవగాహనతో స్పందించిన తీరు సత్ఫలితాలనిస్తున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు శ్రీశైలం మండలంలో 150కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో మల్లిఖార్జున స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపేశారు. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది రికవరీ అవుతుండటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ప్రతిరోజు 15కు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేసులు పెరగకుండా అప్రమత్తమైన ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమే బాధ్యత తీసుకున్నారు. రోజువారి వ్యాయామాలు,ఆయుర్వేద చిట్కాలు పాటించటమే కాకుండా విధిగా మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించారు. శుభకార్యాలను పూర్తిగా పక్కనబెట్టారు. దీంతో అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి.
అటు అధికారులు కూడా పాజిటివ్ కాంటాక్టులను గుర్తించి ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో ఆ ప్రాంతాల్లో ఎవరూ తిరగకుండా చర్యలు తీసుకున్నారు. మండల తహశీల్దార్ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దీంతో శ్రీశైలంలో కేసులు కంట్రోల్‌లోకి వచ్చాయి. మండలంలో పాజిటివ్ వచ్చిన వారిలో ఇప్పటివరకు 46 మంది కోలుకున్నారు. ఆగస్టు 10 నాటికి మరో 50 మంది కోలుకుంటారని వైద్యాధికారులు తెలిపారు. ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరిగినా కరోనా వ్యాప్తి అదుపులోకి రావటం అక్కడి ప్రజలకు కాస్త ఉపశమనాన్నిస్తోంది.