AP Elections: జేసీ, కేతిరెడ్డి వర్గీయుల రాళ్లదాడులు... గన్నవరం, నర్సారావుపేటల్లో ఘర్షణలు
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓంశాంతినగర్ లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఓంశాంతినగర్ లో ఒకేసారి ఎదురుపడడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు రాళ్లదాడికి దిగాయి. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడడంతో స్థానికులు భయంతో తలుపులు వేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల,నర్సరావుపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత పల్నాడు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
నర్సరావుపేట మండలం రెంటాలలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కాన్వాయ్ పై వైసీసీ వర్గీయులు దాడికి దిగాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మూడు చోట్ల టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి.
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ,వైఎస్ఆర్సీపీ వర్గీయుల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన వాహన శ్రేణిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడికి దిగినట్టుగా టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మరెడ్డి ఆరోపించారు.
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ కార్లు ఎదురుపడిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు చెప్పులు, రాళ్లను పరస్పరం విసురుకున్నారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సీఆర్పీఎఫ్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.బ్రహ్మణ కాలువ గ్రామంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీఆర్ పీఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.