ట్విట్టర్ పిట్ట నలిగిపోతోంది.. ఆ ఇద్దరి కామెంట్ల యుద్ధం ఆ రేంజ్‌లో వుందా?
ట్విట్టర్ పిట్ట నలిగిపోతోంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్న ఇద్దరి ట్వీట్లతో చిరాకు పడుతోంది. ఏవో మూడు ట్వీట్లు, ఆరు రీట్వీట్లతో లాగౌట్ అవుతారనుకుంటే, ఏకబీగిన ట్వీట్ వార్‌తో విసుడుపడుతోంది. తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పొయ్యే అవసరం లేకుండా, క్షణాల్లో సమాచారం చేరవేసే ట్విట్టర్ పిట్ట ఎందుకంతగా రగిలిపోతోంది? ఆ ఇద్దరి కామెంట్ల యుద్ధం ఆ రేంజ్‌లో వుందా?
మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్...ట్వీటుకు ట్వీటుతోనే సమాధానం. తిట్లయినా, పొగడ్తలైనా, సెటైర్లైనా, డైలాగ్స్ ఏవైనా, ట్వీటే మాట, ట్విట్టరే వేదిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మధ్య ట్వీట్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని కొన్నిరోజులుగా టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ లోకేష్ సాగిస్తున్న ట్వీట్ వార్‌పై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇద్దరి ట్వీట్ల యుద్ధం పీక్స్‌కు చేరింది.
వైఎస్ జగన్ ఏడాది కాలంలో రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని, ఎంత భ్రష్టుపట్టించారో, ప్రజలను ఎంత మోసం చేశారో, అభివృద్దిని ఎలా నాశనం చేశారో, రాష్ట్ర పరువును ఎంతలా దిగజార్చారో అంటూ, ట్వీట్ చేస్తూ, వీడియో పెట్టారు లోకేష్. అంతేకాదు, జగన్ ఏడాది పాలన విధ్వంసాన్ని గురించి, ఇప్పుడు వైసీపీ నేతలే రోజుకొకరు, ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. తన ట్వీట్ అంటే కొందరు వణికిపోతున్నారని కూడా కామెంట్ చేశారు.
ఇక లోకేష్ అలా ట్వీట్ చేశారో లేదో, వెంటనే ట్విట్టర్‌లోకి ఎంటరైపోయి, అస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. లోకేష్ అసహనం వెనుక కారణాలున్నాయంటూ సెటైర్లు విసిరారు. లోకేష్ అసమర్ధుడని సొంత తండ్రే సర్టిఫై చేశాక ఆయనలో ఉద్రేకం కనిపిస్తోందంటూ సాయిరెడ్డి ఆరోపించారు. అలాగే చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపైనా సాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
విజయసాయి రెడ్డి ట్వీట్‌లో ఏముందంటే, లోకేష్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లే కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తనను కాక మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ఆవేదన తాలూకు ఉద్రేకం బయటపడినట్లు అనిపిస్తోంది. పనికి రాడని సొంత తండ్రే సర్ఠిపై చేస్తే తన ఫ్యూచర్ ఏంటని లోకేష్ కుంగిపోతున్నాడు పాపం అంటూ సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాల ట్వీట్ వదిలారు.
టీడీపీ నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ, నారా లోకేష్ పేరెత్తే అర్హత ఎవరికీ లేదంటూ రంకెలేస్తున్నారు. అంటే కనీసం పేరు పెట్టి పిలిపించుకునే యోగ్యత కూడా మీ నాయకునికి లేదా వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయి. 2024లో లోకేష్ నాయకత్వంలో టీడీపీ ఘోర ఓటమికి గురవుతుందని మరచిపోతే ఎలా, ఇంతకీ బ్లీచింగ్ పౌడర్ ధర తక్కువా...మైదా పిండి ధర తక్కువా....పోనీ కిలో పప్ప రేటెంతో చెప్పు అంటూ ట్వీట్ చేశారు. ఇలా ట్విట్టర్ వేదికగా, లోకేష్, విజయసాయిల మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ట్వీట్‌కు ట్వీట్‌తోనే కౌంటర్ ఇస్తున్నారు.