AP Assembly: రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly: చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం ఎల్పీ సమావేశం
AP Assembly: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతుంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమైంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు జరగుతున్న సమావేశాలు కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మంగళవారం రోజున ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి ఏడున బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు కొన్ని బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నించనుంది. ఇక సమావేశాలకు చంద్రబాబు మినహా టీడీపీ సభ్యులు హాజరుకానున్నారు. సభలో చర్చించే అంశాలపై చంద్రబాబు అధ్యక్షతన మరికాసేపట్లో లెజిస్టేటివ్ పార్టీ మీటింగ్ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో వాడీ వేడీగా సభ జరగనుంది.