రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కోర్టుకు తరలించే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఆయనను శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గాన తరలించడం వలన విజయవాడకు రావడంలో ఆలస్యం అయింది. అయితే చట్టప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటలలోపు కోర్టులో హాజరు పరచాలి.
ఈ క్రమంలో శుక్రవారం కోర్టు సమయం కూడా ముగియడంతో ఆయనను నేరుగా జడ్జి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరచాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అచ్చెన్న తోపాటు మరికొందరిని జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ముందుగా విజయవాడలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆరుగురు నిందితులకు వైద్య పరీక్షలు చేసి నేరుగా జడ్జి ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.