ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు. కుయుక్తుల్తో శకునికి మించిన చాతుర్యం ప్రదర్శించే రాజకీయ రాజధాని నెల్లూరులో ఇప్పుడు కొత్తతరహా వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. లీకేజీలు నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ బాండింగ్‌ను బయట పెడుతున్నాయి. ఇంతకి ఏంటా కొత్త కోణాలు? ఏంటా ఎత్తులు.. వ్యూహాలు.?
ఒకప్పటి ముఠా తగాదాలు, వర్గ వైరుధ్యాలు. ఒకప్పటి ప్రత్యర్థులు.... ప్రత్యర్థి వర్గాల్లో అనుచరులు. ఎప్పటికప్పుడు ఎత్తులు, వ్యూహాలు తెలిపే వేగులు. దశాబ్దాల సంప్రదాయం మళ్లీ తెరపైకి వస్తోందా? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేగుల పర్వం మొదలైందా? సింహపురిలో తాజా రాజకీయం ఏమంటోంది?
ఇటీవల మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. అధికారులే లక్ష్యంగా భగ్గుమన్నారు. మంత్రి అనిల్‌కుమార్‌పై అక్కసు వెళ్లగక్కారు. తమ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చెప్పినా ఫైళ్లు ముందుకు కదలడం లేదనీ, ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని సాగునీటి ప్రాజెక్టులు దాదాపుగా పడకేశాయని, ఏడాదిలో సాధించిందేమీ లేదని ఆనం ఆగ్రహించారు. ఇలాగే కొనసాగితే ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది అధికార పార్టీలో ఒకరకంగా అలజడి రేపింది. ఇది పరోక్షంగా మంత్రి అనిల్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడినవేనంటూ జిల్లాలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పటి ఆనం రాజకీయ కుటుంబంలో పెద్దగా ఉన్న భక్తవత్సలరెడ్డి కుమారుడు ప్రస్తుతం టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అసలు గుట్టు బయటపెట్టారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య లీకేజీలు, వాటి వెనుక ప్యాకేజీలు అన్నింటికి మించి ఆధిపత్యపోరులు, అంతర్యుద్ధాల వ్యవహారం ఒక్కసారిగా గుప్పుమన్నది.
అసలు విషయం చెప్పుకునే ముందు దీనికి కారణమైన వేగులు గురించి తెలుసుకోవాలి.
వెంకటరమణారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయనకు అధికార పక్షంతో బంధాలు, బంధుత్వాలు మెండుగానే ఉన్నాయి. ఆనం రామనారాయణరెడ్డి ఈయనకు స్వయాన బాబాయి. మరో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుటుంబంతో 50, 60 ఏళ్ల అనుబంధం ఉంది. ఇంకోమాటగా చెప్పాలంటే భక్తవత్సలరెడ్డి బంధువులను వైఎస్‌కు దగ్గర కుటుంబీకులతో వివాహ బంధాలు ఉన్నాయి. పేరుకు ఆయన ప్రతిపక్షమైనా అనుబంధాల్లో మాత్రం అధికార పక్షానికి చాలా దగ్గరగానే వున్నాయి. ఇదే ఆనం ఫైర్ వెనుక చాలా గుట్టును బయటపెట్టింది.
అసలు కథ ఏంటంటే... వెంకటగిరిలోని సుమారు 250 కోట్ల రూపాయల విలువైన ఆల్తురుపాడు బాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ఏడాది నుంచి ఆగిపోయాయి. అలాగే ఆనం మంత్రిగా ఉన్న సమయంలో మంజూరైన సుమారు 950 కోట్ల సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ, మరో 30 కోట్లు విలువైన చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సర్వేపల్లి కాలువ ఆధునీకరణ ఈ పనులన్నీ అగ్రిమెంట్లకే పరిమితమైపోయాయి. సంగం, నెల్లూరు బ్యారేజీ నిర్మాణ పనులు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇదే సమయంలో 14వ ఆర్థిక సంఘం నిధులు మాత్రం మంత్రి అనిల్ హడావుడిగా ఖర్చు చేస్తున్నారట. మంత్రి అనిల్, మాజీ మంత్రి ఆనంల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంతో సందిట్లో సడేమియా అన్నట్లు ఆనం భక్తవత్సలరెడ్డి కుమారుడు వెంకటరమణారెడ్డి ప్రతిపక్షంలో వుంటూ బాబాయి పక్షాన నిలబడి మంత్రిపై విమర్శలు సంధించారు. ఇందులోనే అసలు గుట్టురట్టు చేశారు. పక్కా లెక్కలతో బయటపెట్టారు.
వెంకటరమణారెడ్డి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మంత్రి అనిల్ అనుచరుడు పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్... ఆనం వెంకటరమణారెడ్డికి అధికారపక్షంతో అనుబంధాలు ఉన్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మంత్రి అనిల్‌కుమార్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్నారంటూ వెంకటరమణారెడ్దిపై దుమ్మెత్తిపోశారు. దీనిపై స్పందించిన ఆనం వెంకటరమణారెడ్డి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. కుటుంబాలు, బంధాలు, అనుబంధాలు వేరు, రాజకీయాలు వేరంటూ సెంటిమెంటు సూత్రాన్ని ముందు పెట్టారు. అవినీతిపై ప్రశ్నిస్తే ఈ మాటలు ఏంటంటూ ఎదురుదాడి చేశారు. రాజకీయాలు, బంధవులు, బంధుత్వాలు వేరుగదబ్బయా... దీనిని రాజకీయాలతో ఎలా ముడిపెడతావు అంటూ దివంగత వివేకానందరెడ్డి స్టయిల్‌లో ఆహార్యాన్ని ప్రదర్శించారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధానికి, అసమ్మతులకు, ఆధిపత్య పోరాటాల అసలు గుట్టు బహిర్గతమైంది దటీజ్ నెల్లూరు న్యూ పాలిటిక్స్.