పొరపాటు జరిగింది.. భారత్ లో కరోనా సమూహ వ్యాప్తి లేదు : అంగీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా మహమ్మారి వ్యాప్తి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇచ్చింది. గురువారం తన నివేదికలో భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి సాముహిక వ్యాప్తి దిశలో ఉందని పేర్కొంది. అయితే, ఆ నివేదికలో పొరపాటు జరిగినట్టు WHO శుక్రవారం తెలిపింది. భారత దేశంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు మాత్రమె కరోనా వైరస్ కేసులు ఉన్నాయని తాజాగా వివరించింది.
WHO అన్ని ప్రపంచంలోని అన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తిని వివరించడం కోసం నాలుగు కేటగిరీలుగా విభజించి చెబుతుంది. ధ్రువీకరించిన కేసులు లేకపోవడం, చాలా తక్కువ కేసులు, కొన్ని కేసులు, సమూహ వ్యాప్తి అనే విధంగా విభజిస్తుంది. ఈ విధానంలోనే గురువారం WHO ప్రకటించిన నివేదికలో భారత్ ను నాలుగో కేటగిరీ సమూహ వ్యాప్తి లో చేర్చింది. సమూహ వ్యాప్తి అంటే వైరస్ ఎవరినుంచి సోకిందో తెలీని స్థితి. అది ఇబ్బందికర పరిస్థితులను సృశితిస్తుంది.
కాగా, దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో దేశంలో సమూహవ్యాప్తి లేదని స్పష్టం చేశారు. మొత్తం 600 జిల్లాల్లో 400 జిల్ల్లాల్లో కరోనా ఉనికే లేదని అయన తెలిపారు. కేవలం 133 జిల్లాలే కరోనా వ్యాప్తి చెందుతున్న జిల్లాలుగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా గతంలో వైరస్ సమూహ వ్యాప్తి ఉంటె ప్రజలకు ఆ విషయాన్ని తెలియపరుస్తామనీ, దానిని దాచిపెట్టే ఆలోచనే ఉండదనీ గతంలో చెప్పారు.
ఇదిలా ఉంటె, శుక్రవారం మధ్యాహ్నానికి దేశంలో 6,412 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 199 మంది మృతిచెందారు.