CM KCR: గులాబీ అధినేత అతి త్వరలో చేయబోతున్న ప్రకటనేంటి?

CM KCR: గులాబీ అధినేత అతి త్వరలో చేయబోతున్న ప్రకటనేంటి?
x
Highlights

కేసీఆర్‌ ప్రతి మాట వెనకా, అంతుచిక్కని ఆటంబాంబు మూటేదో వుంటుందట. యథాలాపంగా ఏదో సరదాగా మాట్లాడారని అనుకునేలోపే, అదేదో చాణక్యమని బోధపడుతుందట. ఇప్పుడు తన...

కేసీఆర్‌ ప్రతి మాట వెనకా, అంతుచిక్కని ఆటంబాంబు మూటేదో వుంటుందట. యథాలాపంగా ఏదో సరదాగా మాట్లాడారని అనుకునేలోపే, అదేదో చాణక్యమని బోధపడుతుందట. ఇప్పుడు తన కుమారుడు కేటీఆర్‌ పట్లా, ఊహకందని వ్యూహానికి పదునుపెట్టారా? పట్టాభిషేకానికి రాచబాట పరిచేందుకు, ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇంతకీ కేసీఆర్‌ మదిలో తారకమంత్రమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏం చేసినా, ఏం మాట్లాడినా, దాని వెనక అంతులేని వ్యూహముంటుందని, ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత, తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనకా ఒక స్ట్రాటజీ వుందని అప్పుడే అర్థమైంది. కేటీఆర్‌ను పక్కనే కూర్చోబెట్టుకుని, ప్రశంసలు కురిపించి, అనేక నర్మగర్భమైన మాటలు మాట్లాడారు కేసీఆర్. త్వరలో సీఏఏకు వ్యతిరేకంగా, జాతీయస్థాయిలో పోరాటం చేస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ మాట వెనక నిగూఢార్ధం దాగుందన్న చర్చ అప్పుడే జరిగింది. ఇప్పుడవి కార్యరూపం దాల్చబోతున్నాయని వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటది?

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టిపెడితే, రాష్ట్ర పగ్గాలు ఎవరు చేపడతారన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవ్వరైనా టక్కున చెప్పేది కేటీఆరేనన్నది కూడా అంతే సహజమైన ఆన్సర్. త్వరలో కేసీఆర్ రాజ్యసభకు వెళతారని, నేషనల్ పాలిటిక్స్‌లో ప్రత్యామ్నాయ రాజకీయానికి పావులు కదుపుతున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. అంటే రాష్ట్ర అధికార పగ్గాలు, కేటీఆర్‌కు అప్పగిస్తారన్నది ఆ అంచనాల వెనక దాగున్న రహస్యమంటున్నారు విశ్లేషకులు.

కొన్ని రోజులుగా కేటిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మునిసిపల్ ఎన్నికల తరువాత మంచిరోజు చూసుకుని, కేటిఆర్‌ను సిఎమ్ చేయబోతున్నారంటూ స్వయంగా మంత్రులు తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. అయితే అనూహ్యంగా మరో పదవి తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రిని చేయాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారట. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కొంతమంది సీనియర్లతో కూడా ఇదే విషయం చర్చించారట. కేటీఆర్‌ను డిప్యూటీ సీఎం చేస్తే, ఎలా ఉంటుందనే దానిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి ఏ నిర్ణయమైనా, వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు చూస్తే, అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. స్థానిక సంస్థలు, మొన్నటికి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలూ కావచ్చు. కేటిఆర్‌ను ముందుపెట్టి ఈ ఎన్నికలకు వెళ్లారు గూలాబీ బాస్. దీంతో అన్ని ఎన్నికల్లో కేటిఆర్ సక్సెస్ అవుతూవచ్చారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కేటిఆర్, పార్టీని కూడా సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. దీంతో కేటిఆర్‌కు ఏ పదవి ఇచ్చినా, సమర్దవంతంగా నిర్వహించడంలో కేటిఆర్‌కే చెల్లుతోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. సో, రేపు ముఖ్యమంత్రి అయినా ,ఉప ముఖ్యమంత్రి అయినా కూడా కేటిఆర్ సమర్ధవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం క్యాడర్‌లో కలిగేలా చేయడంలో కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారన్న చర్చ జరుగుతోంది.

ఇక డిప్యూటి సిఎమ్ కేటిఆర్ కావడం దాదాపు ఖాయం అయిందని అంటున్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటి సిఎమ్ గా తాటికొండ రాజయ్య, మహమూద్ అలీ ఉన్నారు. రాజయ్యపై ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి కడియం శ్రీహరికి అవకాశమిచ్చారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎవరికీ డిప్యూటి సిఎమ్ పదవి కట్టబెట్టలేదు కేసిఆర్. కేటిఆర్ డిప్యూటి సిఎమ్ అయితే, పలు కీలక నిర్ణయాలు కూడా కేటిఆర్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రిలేని సమయంలో అవసరం అనుకుంటే మంత్రివర్గ సమావేశం కూడా పెట్టవచ్చు. అదే విధంగా కొన్ని కీలక ఫైల్స్ మీత సంతకాలు పెట్టాలనుకుంటే డిప్యూటి సిఎమ్ హోదాలో సంతకాలు కూడా పెట్టవచ్చు అంటున్నారు. ఆ విధంగా రాష్ట్రంలోనూ, పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ ఇక కేటీఆరే ప్యూచర్‌ సీఎం అన్న మైండ్‌ సెట్‌‌ కోసం, డిప్యూటీ సీఎం పదవితో శ్రీకారం చుట్టాలన్నది గులాబీ అధినేత ఆలోచనగా అర్థమవుతోంది.

కేటిఆర్‌ను సిఎమ్ చేయాలంటే డైరెక్ట్‌గా చేయవచ్చు. కాని పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ల నుంచి, ఎలాంటి సమస్యయినా రావచ్చనే అనుమానంతోనే, గులాబీ బాస్ తన రాజకీయ వ్యూహానికి పదునుపెట్టి, ముందుగా కేటిఆర్‌ను ఉప ముఖ్యమంత్రిని చేసి, కొన్ని నెలల తరువాత ముఖ్యమంత్రిని చేస్తే, పార్టీలో కూడా ఎలాంటి విమర్శలూ రావని అనుకుంటున్నారట. మొత్తానికి కేటీఆర్‌పై వస్తున్న ఊహాగానాలు మాత్రం ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ సస్పెన్స్‌‌కు అతి త్వరలో తెరపడటం ఖాయంగా కనపడుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories