ఆర్టీసీ సమ్మె : అతితెలివి ప్రదర్శిస్తున్నారు.. హైకోర్టు అసహనం

ఆర్టీసీ సమ్మె : అతితెలివి ప్రదర్శిస్తున్నారు.. హైకోర్టు అసహనం
x
Highlights

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమించాలంటూ కార్మికులను ఆదేశించలేమని స్పష్టం చేసింది. మొత్తం...

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమించాలంటూ కార్మికులను ఆదేశించలేమని స్పష్టం చేసింది. మొత్తం ఆర్టీసీ బస్సులు ఎన్ని? ఇప్పుడెన్ని తిరుగుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానంగా 75 శాతం బస్సులు తిరుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించిన హైకోర్టు వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీని తీసుకురావాలని సూచించింది. విచారణను నవంబర్ 1 కి వాయిదా వేసింది.

ఈరోజు హైకోర్టులో మళ్లీ ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చ సాగింది. వాదోపవాదనలు జరిగాయి. బకాయిలు పడ్డ సొమ్ము విషయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వంపై హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేమన్న కోర్టు బ్యూరోక్రాట్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. సమస్యను తేల్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో శుక్రవారం కోర్టుకు రావాలని ఆర్థికశాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ తర్వాతి విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. విభజన తర్వాత ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో కనీసం నాలుగు డిమాండ్లు పరిష్కరించి, 47 కోట్లు ఇస్తారా? లేదా? అని సూటిగా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని, గడువు ఇస్తే ప్రయత్నిస్తామని ఏజీ చెప్పారు. హుజూర్‌నగర్‌లో 100 కోట్ల రూపాయల వరాలు ప్రకటించడంపై న్యాయస్థానం స్పందించింది. కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు వాస్తవాలను మరుగున పెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మొత్తం తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయో చెప్పాలన్న హైకోర్టు ప్రస్తుతం ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ఆదేశించింది. బస్సులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న హైకోర్టు ఆర్టీసీ ఎండీ విచారణకు ఒక్కసారైనా హాజరయ్యారా? అంటూ ప్రశ్నించింది. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపినా ఇప్పటికీ మూడో వంతు బస్సులు కూడా తిరగడం లేదని హైకోర్టు మండిపడింది. ఆర్థిక శాఖ కేవలం బడ్జెట్ కేటాయింపులకు మాత్రమే పరిమితమైందని పెదవి విరిచింది.

ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందారని, సమ్మె వల్ల ప్రజలు మాత్రమే కాక 50 వేల కార్మికుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కార్మికులకు సూచించింది. ప్రభుత్వ బకాయిలపై ఆర్టీసీ ఎండీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు 335 కోట్లు చెల్లించారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పూర్తి వివరాలతో శుక్రవారం మరోసారి రావాలని ఆదేశించింది. ఆర్టీసీ యూనియన్ల సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యాయస్థానం సరూర్‌నగర్ స్టేడియంలో సభ జరుపుకునేందుకు అనుమతినిచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories