Telangana CM: తెలంగాణ సీఎం ప్రకటనపై వీడని ఉత్కంఠ

Telangana Cm Candidate Announcement Postponed
x

Telangana CM: తెలంగాణ సీఎం ప్రకటనపై వీడని ఉత్కంఠ

Highlights

Telangana CM: మల్లికార్జున ఖర్గేతో చర్చించిన అనంతరం ప్రకటన వచ్చే ఛాన్స్

Telangana CM: తెలంగాణ కొత్త సీఎం ప్రకటనపై సందిగ్దత కొనసాగుతోంది. సీఎల్పీ నాయకుడు ఎవరన్నదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. సీఎం ఎంపికతో పాటు ఇవాళే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భావించారు. సీఎం ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అనూహ్యంగా సీఎం ప్రకటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్‌ ఎటూ తేల్చలేదు. అధిష్టానం పెద్దలతో చర్చించి రేపు ప్రకటించనున్నట్టు ఖర్గే తెలిపినట్టు సమాచారం.

సీఎం ఎంపికపై రోజంతా హైడ్రామా నడిచింది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమై.. కీలక నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవ్యాఖ్య తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని తీర్మానించారు. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాష్ట్ర నాయకత్వం పంపిన తీర్మానాన్ని అధ్యయనం చేసి అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో అధిష్ఠానం నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేచిచూస్తున్నారు.

సీఎల్పీ ఎంపిక కోసం చర్చించడానికి ఢిల్లీ వెళ్లారు డీకే శివకుమార్. ఏఐసీసీ పిలుపు మేరకు డీకేతో పాటు..మరో నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీ వెల్లారు. రేపు ఖర్గేను కలిసి.. సీఎల్పీ నేత ఎంపికపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష ఏకవ్యాఖ్య తీర్మానంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు డీకే శివకుమార్. వారి అభిప్రాయాలను నివేదిక రూపంలో హైకమాండ్‌కు సమర్పించనున్నారు.

డీకే ఇచ్చిన రిపోర్ట్ తో అధిష్టానం సీఎల్పీపై ప్రకటన చేసే అవకాశముంది. తెలంగాణ శాసనసభాపక్షం నుంచి వచ్చిన తీర్మానాన్ని.. సోనియా, రాహుల్‌తో చర్చించనున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అధిష్టానంతో చర్చల అనంతరం సీఎం అభ్యర్థి ఎవరనేది ఖర్గే ప్రకటించనున్నారు. అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చాకే గవర్నర్‌ను కాంగ్రెస్‌ నేతలు కలవనున్నట్టు తెలుస్తోంది. అప్పుడే సీఎం ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇక తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈవో వికాస్ రాజ్ గవర్నర్‌కు సమర్పించారు.

మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సర్క్యులర్ జారీ చేశారు. అంతకు ముందు ఇవాళే కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు చకచకా ఏర్పాటు జరిగాయి. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. కానీ సీఎల్పీ ఎంపిక ప్రక్రియ వాయిదా పడడంతో ప్రమాణస్వీకార ఏర్పాట్లను వాయిదా వేశారు.

తెలంగాణ కొత్త సీఎం ఎంపిక ప్రక్రియలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎల్పీ నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ తీర్మానం చేయించడంతో పాటు ఏఐసీసీ పెద్దలతో చర్చించడం వరకు అన్నీ తానై చూసుకుంటున్నారు. తాజాగా సీఎల్పీ నేత ఎంపిక కోసం అధిష్టానంతో చర్చించడానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. రేపు ఖర్గేతో సమావేశమై కీలక ప్రకటన చేయనున్నారు డీకే. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా టీకాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు ఆయన. ఇతర పార్టీ నేతల జాయినింగ్ విషయంలో ప్రత్యేక శ్రధ్ధ చూపారు. కాంగ్రెస్ తరపున తెలంగాణలో ప్రచారం కూడా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories