నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల..

Release of Rythu Bandhu Funds from Today
x

నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల..

Highlights

నేటి నుంచే అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ.. ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

Rythu Bandhu: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని రైతులందరికీ పంట పెట్టుబడి సాయం చెల్లింపులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కానందున.. గతంలో మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని ఆదేశించారు. అర్హులైన అన్నదాతల ఖాతాల్లో తక్షణం నిధులు జమ అయ్యేలా చూడాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులు విడుదల చేయాలని నిర్దేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు. అలాగే.. 2లక్షల మేర రుణమాఫీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో.. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్‌ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రామ కృష్ణరావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories