Hyderabad: ధైర్యసాహసాలకు గుర్తింపు.. దొంగలతో పోరాడిన తల్లికూతురికి పోలీసుల సన్మానం

Police Honored Mother And Daughter Who Fought With Robbers
x

Hyderabad: ధైర్యసాహసాలకు గుర్తింపు.. దొంగలతో పోరాడిన తల్లికూతురికి పోలీసుల సన్మానం

Highlights

Hyderabad: సాధారణంగా తుపాకీ చూస్తే ఎంతటి వాళ్లైనా భయపడతారు. బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఇచ్చి పంపుతారు.

Hyderabad: సాధారణంగా తుపాకీ చూస్తే ఎంతటి వాళ్లైనా భయపడతారు. బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఇచ్చి పంపుతారు. కానీ బేగంపేటలో ఒక తల్లీ కూతుళ్లు ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన అందరిని ఆశ్చర్యపర్చింది. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ తల్లికూతుళ్ల ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సలాం కొడుతున్నారు. బేగంపేట లోని రసూల్‌పూరలోని హౌసింగ్ కాలనీలో ఈ ఘటన జరిగింది.

బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్‌ జైన్, అమిత్‌ మహోత్‌ భార్యాభర్తలు. వారికి ఒక మైనర్‌ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్‌ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్‌ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న నాటు తుపాకీ, కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్‌ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది.

అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్‌ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్‌ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు కత్తులు, నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. దుండగుల మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఈ సందర్భంగా తల్లీ కూతుళ్ళు చూపిన తెగువ ను అందరూ అభినందిస్తున్నారు. మహిళలు అయినా ఏ మాత్రం బెదరకుండా ధైర్య సాహసాలు ప్రదర్శించి దొంగలు పట్టుకున్న తీరు పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నార్త్ జోన్ డీసీపీ ఇందిరా ప్రియ దర్శిని తల్లీ కూతుళ్లు ఇద్దరినీ వారికి ఇంటికి వెళ్లి మరీ సన్మానించారు. తన పదకొండేళ్ల సర్వీస్ లో ఇలా ధైర్య సాహసాలు చూపిన మహిళని చూడలేదని కితాబిచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories