సొంత పార్టీలో బండి సంజయ్‌కు కుంపట్లా.. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది ఎవరు?

సొంత పార్టీలో బండి సంజయ్‌కు కుంపట్లా.. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది ఎవరు?
x
బండి సంజయ్‌
Highlights

ఆయన చాలా తక్కువ టైంలో ఎక్కవ పాపులర్ అయ్యారు. దూకుడు ప్రసంగాలతో అందరి దృష్టిలోనూ పడ్డారు. కానీ ఇప్పుడాయన నియోజకవర్గంలో, అదే పార్టీలోనే కుంపట్లు...

ఆయన చాలా తక్కువ టైంలో ఎక్కవ పాపులర్ అయ్యారు. దూకుడు ప్రసంగాలతో అందరి దృష్టిలోనూ పడ్డారు. కానీ ఇప్పుడాయన నియోజకవర్గంలో, అదే పార్టీలోనే కుంపట్లు రాజుకుంటున్నాయట. సొంత మనుషులు అనుకున్నవాళ్లే వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన? సొంత పార్టీలోనే ఈ కుంపట్లు దేనికి సంకేతం?

బండి సంజయ్. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు. బీజేపీ రాష్ట్ర నాయకుల సరసన చేరిపోయారు. ఉన్న నలుగురు ఎంపీల్లో మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు రాష్ట్రస్థాయిలో చాలా అంశాలపై ప్రభుత్వాకి వ్యతిరేకంగా ధాటిగా తన వాయిస్ వినిపిస్తూ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులోనూ సంజయ్ పేరు వినిపించింది.

అయితే, సంజయ్‌కి కరీంనగర్ జిల్లాలోని ఇతర బీజేపీ నేతలు మాత్రం దూరంగానే ఉంటున్నారట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సంజయ్ ఒక్కడే అన్నీ చోట్ల ప్రచారం చేశారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో కూడా సంజయ్ చేసిన పాద యాత్రలో సీనియర్‌లు ఎక్కడా కనిపించలేదు. ఇలా ఒకటేమిటి చాలా వాటిల్లో సంజయ్‌కి, జిల్లా బీజేపీ నాయకుల మధ్య గ్యాప్ ఉంటూనే ఉంది. అయితే ఇదంతా కొత్తగా ఇప్పుడు ఉన్న విభేదాలు, పట్టింపులు కావంటున్నారు ఆయన అనుచరులు.

ఎంపీగా గెలవక ముందు కూడా, సంజయ్‌కి పార్టీ లో చాలానే ఇబ్బందులు ఎదురయ్యాట. ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన తరువాత కూడా మళ్లీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన సమయంలోనూ, సీనియర్లు అడ్డుపడ్డారని దీంతో పాటుగా సంజయ్ కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా ప్రయత్నాలు చేశారంటూ సంజయ్ అనుచరులు ఇతర నాయకులపై కాస్త గుర్రుగానే ఉన్నారట.

అయితే ఇప్పుడు సంజయ్‌కి, జిల్లాలోని ఇతర బీజేపీ నాయకులకి మధ్య ఉన్న గ్యాప్ కూడా ఆనాటి నుంచే కొనసాగుతూ వస్తుందంటున్నారు అనుచరులు. అందుకే సంజయ్ కార్యక్రమాలకు వాళ్ళు, వాళ్ళ కార్యక్రమాలకు సంజయ్ వెళ్లరు. ఒకవేళ స్టేజి పంచుకోవాల్సి వస్తే మాత్రం అది అప్పటి వరకే. ఎంపీగా సంజయ్ గెలిచిన తరువాత అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై బీజేపీ నుంచి నిరసనలు జరిగాయి. కానీ అవన్నీ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా జిల్లాలో సాగాయి.

ఇలా సీనియర్ల మీద సంజయ్ అనుచరులు చెప్పుకొస్తున్నట్టుగానే ఆ వర్గం అనుచరులు సంజయ్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సంజయ్‌లో ఏకపక్ష పోకడ ఉంటుందని మర్యాద ఉండదంటూ ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. నిజానికి కరీంనగర్ జిల్లా నుంచి బీజేపీకి మంచి నాయకులు ఉన్నప్పటికీ గ్రూపులుగా, ఎవరికి వారు వర్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి అస్సలు పొసగకపోవడం వల్ల చాలాసార్లు బీజేపీకి నష్టం జరుగుతూ వచ్చింది. ఇప్పుడూ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సంజయ్‌ విషయంలోనూ గ్రూపు రాజకీయాలు బ్లాస్ట్‌ అవుతున్నాయి. పార్టీ ఎదగాల్సిన టైంలో, ఇలా కోల్డ్‌వార్‌తో మొదటికే నష్టమంటున్నారు కమలనాథులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories