తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు.. వడగళ్లు, ఈదురు గాలులతో బీభత్సం

Heavy Rainfall In Telangana
x

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు.. వడగళ్లు, ఈదురు గాలులతో బీభత్సం

Highlights

Telangana: నీట మునిగిన పంట పొలాలు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన జనాలకు ఉపశమనం లభించింది. అయితే అదే అకాల వర్షాలు రైతన్నలను నట్టేట ముంచాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దయింది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. టార్పాలిన్లు లేకపోవడంతో వరదలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నందిపేట మండలం ఖుద్వాన్‌పూర్‌లో పిడుగుపాటుకు మూడు గేదెలు చనిపోయాయి. గాలివాన బీభత్సంతో చెట్లు నేలకొరకగా, పలుచోట్ల స్తంభాలు విరిగిపోయాయి. అర్ధరాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న వరిధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. పదిరోజులు గడుస్తున్నా.. పూర్తి్స్థాయిలో తూకం వేసి కొనుగోలు జరపకపోవడంతో మార్కెట్‌ యార్డులలోని ఐకేపీ కేంద్రాలలో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసిముద్దయ్యింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీ‎ణవంక, ఇల్లంతకుంట మండలాల్లో అకాల వర్షం పంటలను ముంచేసింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోయామని రైతులంటున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వడగళ్ల వాన రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. కనుకుల, మంచిరామి, తొగర్రాయి గ్రామాలలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వాన కురిసింది. వడగళ్ల వాన కురియటంతో కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో వర్షానికి తడిసిపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories