TS News: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం

Free Bus Travel Scheme Started In Telangana
x

TS News: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం

Highlights

TS News: అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

TS News: ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తొలిఅడుగు వేసింది. ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల్లోనే... ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకాన్ని నేటి నుంచి ప్రారంభించింది. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలులోకి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎం రేవంత్ రెడ్డి.. సహా.. ఎమ్మెల్యేలు సీఎస్ శాంతి కుమారి.. రవాణా శాఖ సెక్రటరీ వాణీప్రసాద్, మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు.. సిబ్బందితో పాటు.. తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ బస్సులో ప్రయాణం చేశారు.

గురువారం ప్రమాణ స్వీకారం అనంతరం వాటికి సంబంధించి తొలి సంతకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, తక్షణం అమలులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్‌ను తెచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ పథకం రాష్ట్రం మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ‘‘పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అంతర్‌ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చన్నారు. ఈ పథకం కోసం రాష్ట్రంలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుంది. రోజూ సుమారు 40 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. వారిలో దాదాపు 30 శాతం మంది మహిళలు. వారి సంఖ్య 12 లక్షల నుంచి 14 లక్షల దాకా ఉంటోంది. తాజాగా అమల్లోకి రానున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో లబ్ధిపొందే మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లను కలుపుకొంటే ఆ సంఖ్య 55 శాతానికి పెరుగుతుందని అంచనా. రోజు వారీగా ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ పథకం అమలుతో సుమారు సగం ఆదాయం తగ్గుతుంది. కాగా.. మహిళా ప్రయాణికుల రవాణా ఖర్చును ప్రభుత్వం ఆర్టీసీకి బదిలీ చేయనుంది. ఇందుకోసం ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది’’ అని సజ్జనార్‌ వివరించారు.

‘‘మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్‌ జారీ చేస్తామని.. అందుకు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అయితే.. ఏయే మార్గాల్లో, ఏయే సమయాల్లో రద్దీ ఉంటుందనే విషయమై కొద్ది రోజుల తర్వాత అధ్యయనం చేస్తామని.. అందుకు తగినట్లు సర్వీసులను, బస్సుల సంఖ్యను పెంచుతామని సజ్జనార్ అన్నారు. ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారు రాష్ట్రంలో నివసిస్తున్నట్టుగా చిరునామాను పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే వివిధ గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఆధార్‌, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఇలా ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం అమలుకు సిబ్బందిని కూడా సమాయత్తం చేశారు. శుక్రవారం రెండు షిఫ్టులలో సుమారు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు ఈ పథకంపై జూమ్‌ ద్వారా అవగాహన కల్పించారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. ప్రయాణికులతో సౌమ్యంగా, మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఇటీవల కొత్తగా 776 బస్సులు వచ్చాయని.. మరో 1,050 రానున్నట్టు తెలిపారు. అద్దె ప్రాతిపదికన మరో వెయ్యి విద్యుత్తు బస్సులు కూడా రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్తు బస్సులను కూడా నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories