ఇంట్లో శుభకార్యం కోసం గులాబీ నేతల ఎదురుచూపులు.. ఫంక్షన్‌ వెనక స్ట్రాటజీ ఏదైనా వుందా?

ఇంట్లో శుభకార్యం కోసం గులాబీ నేతల ఎదురుచూపులు.. ఫంక్షన్‌ వెనక స్ట్రాటజీ ఏదైనా వుందా?
x
Highlights

గులాబీ నాయకుల్లో కొందరు తమ ఇంట్లో పెళ్లి కార్యక్రమం వుంటే బాగుండని భావిస్తున్నారు. ఏదైనా బర్త్‌ డే ఫంక్షన్‌ వున్నా ఎంత బాగుండేదని ఆలోచిస్తున్నారు....

గులాబీ నాయకుల్లో కొందరు తమ ఇంట్లో పెళ్లి కార్యక్రమం వుంటే బాగుండని భావిస్తున్నారు. ఏదైనా బర్త్‌ డే ఫంక్షన్‌ వున్నా ఎంత బాగుండేదని ఆలోచిస్తున్నారు. కనీసం గృహప్రవేశమైనా వుంటే సూపర్‌ అని మథనపడుతున్నారు. ఇలా టీఆర్ఎస్‌ నేతల్లో చాలామంది తమ ఇంట్లో శుభకార్యం ఏదైనా వుంటే బాగుండేదని, తమదశ తిరిగిపోతుందని తలపోస్తున్నారు. ఇంతకీ ఫంక్షన్‌ కోసం ఇంతగా నేతలు ఎందుకు అల్లాడిపోతున్నారు? ఈ ఫంక్షన్‌ వెనక ఆయా నేతలకు పెద్ద స్ట్రాటజే వుంది ఇంతకీ ఏంటా వ్యూహం?

గులాబి పార్టీలో నామినేటేడ్ పదవుల భర్తీ ఎప్పుడా అని నేతలు వేచి చూస్తున్నారు. కొత్తవాళ్ల పరిస్థితి అయితే కాస్త బాగానే ఉన్నా, పాత నేతలు మాత్రం ఓపిక పట్టలేకపోతున్నారు. కార్పొరేషన్ చైర్మన్లుగా వారి పదవి కాలం ముగిసినా ఇప్పటికీ రెన్యువల్ కాలేదు. కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ల చెవిన ఈ విషయాన్ని వేసినా చూద్దాం...చేద్దాం అని మాట ఇచ్చారు. కాని నెలలు గడుస్తున్నా తిరిగి పదవులు పొందలేకపోతున్నారు. పదవులున్నప్పుడు కార్లు, సిబ్బందితో అధికార దర్పాన్ని ప్రదర్శించిన వారు ఇప్పుడు మాజీలుగా ఒకింత ఇబ్బందిని ఎదుర్కుంటున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడురి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ఐటీ సంబంధిత కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాకెష్, బివరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తమ పదవుల రెన్యువల్ కోసం పడిగాపులు కాస్తున్నారు.

అయితే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నవారికైతే పర్లేదు కాని ఆర్ధికంగా కాస్త బలహీనంగా ఉన్న నేతలు సతమతమవుతున్నారు. మొదటి దఫా చైర్మన్ పదవి వచ్చినప్పుడు కొందరు నేతలు కాస్ట్ లీ కార్లు బుక్ చేసారు. ఎలాగూ మంత్రులకు వచ్చినట్లు జీతాలు, వేతనాలు వస్తాయి కాబట్టి ప్రతినెలా ఈఎంఐలు చెల్లించేవారు. పీఆర్ ఓలు, పీఏలంటూ అవసరానికి మించి సిబ్బందిని నియమించుకున్నారు. మరోసారి రెన్యువల్ కాకపోతుందా అనే ఉద్దేశంతో ఖర్చులు పెంచుకున్నారు. అయితే చూస్తుండగానే పదవీ కాలం ముగియడంతో, ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద పనిచేసే సిబ్బంది జీతాలు ఇచ్చుకోలేక కాస్త ఓపిక పట్టాలని సూచిస్తున్నారు. ఓనెలో రెండు నెలలో అంటే ఊరుకుంటారు, కాని ఆరునెలలుగా జీతాలు లేకపోవడంతో చాలామంది సిబ్బంది తమ దారి తాము చూసుకుంటున్నారు. తిరిగి పదవులొస్తే చేర్చుకుంటాములే అని మాజీ చైర్మన్లే వారిని పంపిస్తున్నారు. కార్ల ఖర్చులు భరించలేక, ఈఎంఐలు కట్టలేక అవస్తలు పడుతున్నారు.

దీంతో గులాబీ బాస్ దృష్టిలో పడితే తమ పదవుల సంగతి గుర్తు చేసినట్టవుతుందని వీరంతా భావిస్తున్నారు. కాని సార్ అపాయింట్ మెంటు దొరకటం అంత ఈజీగా లేదు. పార్టీ మీటింగ్‌లో, లేదంటే ఏదైనా కార్యక్రమంలోనో కలిసినా అది సందర్భం కాదని తమ గోడును చెప్పుకోలేకపోతున్నారు. దీంతో సరైన సమయం కోసం వేచి చూడటం మినహా మరో మార్గం లేకుండా పోయింది. అందుకే సార్ ను కలిసే సందర్భం వస్తే బాగుండు అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

తన ఇంట్లో శుభకార్యానికి రావాల్సిందిగా ఆహ్వానించేందుకు ఈమధ్య శాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి సీఎంని కలిసి తన పదవి గురించి గుర్తు చేసారు. శుభకార్యం పూట నారాజ్ చేయకుండా పదవిని రెన్యువల్ చేసి ఖుషి చేసారు. మరోవైపు విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైతం కుమారుడి వివాహం సందర్భంగానే తీపి కబురు అందింది. ఆయన్ను రైతు సమన్వయ సమితి చైర్మన్ గా నియమించారు కేసీఆర్. దీంతో శుభకార్యం సెంటిమెంటు వర్క్ అవుట్ అవుతుందని నేతలు నమ్ముతున్నారు. అందుకే తమ ఇంట్లో ఏదన్నా శుభకార్యం వస్తే బాగుండు అప్పుడు శుభలేఖతో సార్‌ను కలిస్తే తమకు తప్పకుండా తీపి కబురు అందిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఎవరింట్లో ఏ శుభకార్యం వస్తుందో ఎవరికి పదవులు దక్కుతాయో అనే చర్చ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories