రాష్ట్రంలో 28 జిల్లాలకు విస్తరించిన కరోనా.. కంటైన్ మెంట్ లను పెంచే ఆలోచనలో..

రాష్ట్రంలో 28 జిల్లాలకు విస్తరించిన కరోనా.. కంటైన్ మెంట్ లను పెంచే ఆలోచనలో..
x
Highlights

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 28 జిల్లాలకు కరోనా వ్యాపించటంతో నియంత్రణ చర్యలపై ఫోకస్ పెంచింది ప్రభుత్వం. కరోనా కేసులు...

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 28 జిల్లాలకు కరోనా వ్యాపించటంతో నియంత్రణ చర్యలపై ఫోకస్ పెంచింది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో నిఘా పెంచిన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

తెలంగాణలో హైదరాబాద్ సహా 28 జిల్లాలకు వ్యాపించింది కరోనా వైరస్. చాపకింద నీరులా విస్తరిస్తూ అధికారులకు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ లో నిన్న ఒక్కరోజే పది కరోనా కేసులు వెలుగులోకి రాగా వికారాబాద్ లోనూ పదకొండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో రెండున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. వికారాబాద్ కు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు కరోనా చికిత్స పొందుతూ నిన్న గాంధీ హాస్పిటల్ లో మృతి చెందారు.

సూర్యాపేట జిల్లాలో ఈ నెల 11న ఒక్క రోజే 10 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తికి ఈ నెల 8న కరోనా పాజిటివ్ అని తేలగా అతని కుటుంబంలోని ముగ్గురు కూడా కరోనా బారిన పడ్డారు. నిర్మల్ జిల్లాలో కరోనా కేసులు 19కి చేరుకోగా భైంసాలో ఐదు కేసులున్నాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. భైంసాలో ఓ ఏడాది బాలుడికి కరోనా సోకటం కలకలం రేపింది.

ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ అర్బన్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, నిర్మల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. పది ప్రాంతాల్లో కేసులు తక్కువగా ఉండగా వరంగల్ రూరల్, వనపర్తి, మంచిర్యాల, నారాయణపేట, యాదాద్రి జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి.

కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్మెంట్ ఏరియాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 243 కంటైన్మెంట్ ఏరియాలను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో హైదరాబాద్ లో 123 ప్రాంతాలుండగా జిల్లాల్లో 120 ప్రాంతాన్నాయి. ఆ ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించారు. కరోనా బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్ కు పంపుతున్నారు.

ఇక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో వైద్య సిబ్బంది పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అటు పోలీస్, రెవెన్యూ, పంచాయితీరాజ్ సిబ్బంది కూడా ఇంటింటికీ తిరుగుతూ కరోనా లక్షణాలున్న వారి సమాచారం సేకరిస్తున్నారు. అనుమానితులను గాంధీ హాస్పిటల్ కు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. కేసులు పెరుగుతుండటంతో కంటైన్ మెంట్ లను పెంచే ఆలోచనలో ఉన్నారు అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories