Delhi: పైలట్‌పై చేయి చేసుకున్న ప్యాసెంజర్.. ఇండిగో విమానంలో ఘటన

Passenger Hits Pilot Announcing Flight Delay In Delhi
x

Delhi: పైలట్‌పై చేయి చేసుకున్న ప్యాసెంజర్.. ఇండిగో విమానంలో ఘటన

Highlights

Delhi: ఫ్లైట్ ఆలస్యమైందంటూ పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఘటన

Delhi: ఇండిగో విమానంలో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు అతడిపై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, తొలుత విమానం చాలాసేపు ఆలస్యం కావడంతో మునుపటి పైలట్ స్థానంలో మరో పైలట్ బాధ్యతలు తీసుకున్నారు. ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో పైలట్ మార్పు తప్పనిసరి. బడలిక కారణంగా జరిగే పొరపాట్లు నివారించేలా పైలట్లకు తగినంత విశ్రాంతినిచ్చేందుకు ఈ నిబంధనలు రూపొందించారు. ఈ క్రమంలో పైలట్ విమానం ఆలస్యమైన విషయాన్ని ప్రయాణికులకు అనౌన్స్ చేస్తుండగా వెనక కూర్చున్న ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి పైలట్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దృశ్యం చూసి విమానం క్రూ ఆశ్చర్యపోయారు. అతడిని అడ్డుకున్నారు.

ఈ ఘటన ఏ విమానంలో జరిగిందో తెలియరానప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రయాణికుడి దురుసు ప్రవర్తనను నెటిజన్లు ముక్తకంఠంతో ఖండించారు. ఫ్లైట్ ఆలస్యంలో పైలట్ తప్పేముందని ప్రశ్నించారు. పైలట్ తన బాధ్యత మాత్రమే నిర్వహిస్తున్నాడని గుర్తు చేశారు. ఇలాంటి ప్రయాణికులకు మరోసారి విమానం ప్రయాణానికి అనుమతించకుండా నో ఫ్లై జాబితాలో చేర్చాలని కొందరు తేల్చి చెప్పారు. అతడిని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల కాలంలో పలువురు ప్రయాణికులు ఇండిగో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉదంతాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories