NASA: చంద్రుడిని చుట్టి రావడానికి నాసా తలపెట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం సక్సెస్‌

NASA Artemis-1 Mission to Orbit the Moon is a Success
x

NASA: చంద్రుడిని చుట్టి రావడానికి నాసా తలపెట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం సక్సెస్‌

Highlights

NASA: 25 రోజుల మిషన్‌.. డిసెంబరు 11న భూమికి తిరిగి రానున్న ఓరియన్‌ క్యాప్సూల్‌

NASA: మూడేళ్లలోగా మానవులను చంద్రుడిపైకి పంపించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపెట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌లో తొలి అంకం.. ఆర్టెమిస్‌-1 ప్రయోగం విజయవంతమైంది. ఇంధన లీకేజీ, హరికేన్లు, ఇంజన్‌ సమస్యలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ ప్రయోగం ఎట్టకేలకు నిన్న సక్సెస్‌ అయ్యింది. ఈ ప్రయోగంలో భాగంగా లాంచింగ్‌ వెహికల్స్‌లో అత్యంత శక్తిమంతమైన PLS.. మానవరహిత స్పేస్‌ క్యాప్సూల్‌ ఓరియన్‌ను తీసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది.

రోదసిలోకి దూసుకెళ్లిన రాకెట్‌.. ఓరియన్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ను చంద్రుడి చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 25 రోజుల మిషన్‌లో భాగంగా పంపించిన ఓరియన్‌ క్యాప్సూల్‌లోని సెన్సర్లు డేటాను సేకరించి నాసాలోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పంపుతాయి. అనంతరం ఆ క్యాప్సూల్‌ భూమికి తిరుగుప్రయాణమవుతుంది. గంటకు 25 వేల మైళ్ల వేగంతో భూమివైపునకు దూసుకొచ్చి.. డిసెంబరు 11న కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్‌ సముద్రంలో లాండ్‌ అవుతుంది. రానూపోనూ మొత్తం సుమారు 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణించనుంది.

PLS రాకెట్‌, ఓరియన్‌ క్యాప్సూల్‌.. ఈ రెండూ వ్యోమగాములను చంద్రుడి మీదకు సురక్షితంగా తీసుకెళ్లి, మళ్లీ వెనక్కి తీసుకురాగలవా లేదా తెలుసుకునేందుకే ఈ ప్రయోగం. ఇదంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. 2024లో నాసా ఆర్టెమిస్‌ 2 ప్రయోగాన్ని చేపడుతుంది. అయితే, ఆ ప్రయోగంలో స్పేస్‌ క్యాప్సూల్‌లో వ్యోమగాములు కూడా ఉంటారు. అది కూడా విజయవంతమైతే.. 2025 ఆర్టెమిస్‌-3 ద్వారా తొలి మహిళా వ్యోమగామిని చంద్రుడిపైకి పంపే యోచనలో ఉంది నాసా.

చంద్రుడి మీదికి మానవుడిని పంపి, మళ్లీ వారిని క్షేమంగా భూమి మీదకు తేవడమే లక్ష్యంగా నాసా 1960ల్లో ప్రాజెక్ట్‌ అపోలోను చేపట్టింది. 1969లో చేపట్టిన అపోలో 11 ద్వారా.. నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, బజ్‌ అల్ర్డిన్‌ చంద్రుడిపై నడిచిన తొలి మానవులుగా చరిత్ర సృష్టించారు. 1972 డిసెంబరులో అపోలో 17 మిషన్‌తో ఆ ప్రాజెక్టును నిలిపివేసింది. ఆ మూడేళ్ల కాలంలో మొత్తం 12 మంది వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టారు. తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మానవులను పంపే ఏ ప్రయోగాన్నీ అమెరికా నిర్వహించలేదు.

ఓరియన్‌ క్యాప్సూల్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి నాసా రూపొందించిన PLS నిర్మాణానికి 32వేల 500 కోట్లు ఖర్చు అయ్యింది. స్పేస్‌లాంచ్‌ సిస్టమ్‌ నిర్మాణానికి అయిన ఖర్చును మినహాయించి.. ఆర్టెమిస్‌-1, 2, 3 మిషన్లకు సుమారు 7లక్షల 57 కోట్లు ఖర్చు అవుతోంది. స్పేస్‌లాంచ్‌ సిస్టమ్‌ PLS ఎత్తు 322 అడుగులు.

స్పేస్‌లాంచ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌) ఎత్తు

24,500 మైళ్లు

స్పేస్‌లాంచ్‌ సిస్టమ్‌ రాకెట్‌ గంటకు 24,500 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.

ఆర్టెమిస్‌.. అపోలో కవల సోదరి

అపోలో.. గ్రీకు పురాణగాథల ప్రకారం విలువిద్య, సంగీతం, నృత్యం వంటివాటికి దేవుడు. ఆయన కవల సోదరి ఆర్టెమిస్‌. ఆమెను సెలీనా/మూన్‌గా కూడా కొలుస్తారు. నాసా గతంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ అపోలోకు కొనసాగింపుగా.. ఆయన కవలసోదరి అయిన ఆర్టెమిస్‌ పేరును ఈ ప్రోగ్రామ్‌కు ఎంచుకుంది.

ఓరియన్‌ క్యాప్సూల్‌లో ఏమున్నాయి?

ఓరియన్‌ క్యాప్సూల్‌లో వ్యోమగాములు ఎవరూ లేరు. కానీ, వ్యోమగాములు ప్రయాణిస్తే వారి శరీరాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకునేందుకు వీలుగా.. సెన్సర్లు అమర్చిన మూడు టెస్ట్‌ డమ్మీలను (మానవుల పరిమాణంలో ఉంటాయి) ఓరియన్‌లో పంపిస్తున్నారు. ఆ మూడింటిలో ఒకటి.. కమాండర్‌ సీటులో కూర్చునే డమ్మీ కమాండర్‌ మూనికిన్‌ కాంపోస్‌ బొమ్మ. 1970లో అపోలో 13 మిషన్‌ సురక్షితంగా భూమికి చేరడంలో కీలకపాత్ర పోషించిన ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ ఆర్టురో కాంపోస్‌ గౌరవార్థం ఆ బొమ్మకు ఈ పేరు పెట్టారు. మిగతా రెండు బొమ్మలూ.. హెల్గా, జోహర్‌. ఇవి ప్రయాణికుల సీట్లలో ఉంటాయి. ఒక్కో బొమ్మలో 5600 సెన్సర్లు, 34 రేడియేషన్‌ డిటెక్టర్లు ఉంటాయి. అపోలో 11 మిషన్‌లో భాగంగా చంద్రుడి మీద నుంచి తెచ్చిన చిన్న చంద్రశిల, నాటి స్పేస్‌క్రా్‌ఫ్టకు సంబంధించిన ఒక బోల్ట్‌, ఆర్టెమిస్‌ ప్రోగ్రామ్‌ రబ్బర్‌ స్టాంపు, సైకమోర్‌ చెట్టు విత్తనం ఒకటి, రోదసిపై విద్యార్థులు, పౌరులు రాసిన కవితలు, గీసిన బొమ్మలతో కూడిన యూఎ్‌సబీ పెన్‌ డ్రైవ్‌ తదితరాలు క్యాప్సూల్‌లో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories