కేంద్రంతో చంద్ర‌బాబు రాజీ

Submitted by lakshman on Fri, 03/23/2018 - 13:34
 ysrcp fire on chandhrababu naidu

ఒకవైపు కేంద్రంతో పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు తమ అవినీతిపై విచారణ అనగానే...మరోవైపు అదే కేంద్రంతో రాజీ యాత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షపార్టీ వైసిపి ఆరోపిస్తోంది. అందుకు టిడిపి అనుకూల పత్రికలో వచ్చిన వార్తే ఆధారం అంటోంది.
        ఎపికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం అంటూ...తెలుగుజాతి ఆత్మగౌరవ సమస్య అని ఒకరోజు...రాష్ట్రంపై కేంద్రం యుద్ధం చేస్తోందని మరో రోజు...ఇలా రకరకాల విన్యాసాలతో తన పోరాట నాటకాన్ని రక్తి కట్టిస్తున్న చంద్రబాబు ఆ ముసుగు కూడా త్వరలోనే తొలగిపోనుందని వైసిపి విమర్శిస్తోంది. అయితే కేంద్రం ఎప్పుడయితే తమ అవినీతిపై విచారణ జరిపించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయో మళ్లీ లాలూచీ యత్నాలు ప్రారంభించారని వైసిపి అంటోంది. 
నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన వంటివి ఏవీ సాధించకపోగా, ప్రత్యేక ప్యాకేజ్ కోసం స్పెషల్ స్టేటస్ ను కనుమరుగు చేయాలని శాయశక్తులా ప్రయత్నించిన చంద్రబాబు...ఇప్పుడు ప్రజలే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న దశలో మరోసారి హఠాత్తుగా యూటర్న్‌ తీసుకుని తానే ప్రత్యేక హోదా కోసం ముందునుంచీ పనిచేస్తున్నట్లు నమ్మించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారని వైసిపి ఎద్దేవా చేస్తోంది.
       కేంద్రంతో రాజీ లేని పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న చంద్రబాబు ఎప్పుడయితే బిజెపి నేతలు పట్టిసీమతో సహా వివిధ కార్యక్రమాల్లో అవినీతిపై విచారణ జరుగుతుందని అనగానే...నాలుగేళ్లుగా తాము చేస్తున్న లక్షల కోట్ల అవినీతి వ్యవహారాలు ఎక్కడ బైటపడతాయో అని వణికిపోతున్నారని...అందుకే ఒకవైపు పోరాటం అంటూనే మరోవైపు కేంద్రంతో రాజీకి ప్రయత్నాలు ప్రారంభించినట్లు వైసిపి ఆరోపిస్తోంది. అందుకు టిడిపి అనుకూల పత్రికలో వచ్చిన వార్తే రుజువు అని, బీజేపీయే దిగివచ్చి చంద్రబాబుతో ‘కలిసుందాం..ఇంకా దూరం పెంచుకోవద్దు' అని రాజీ ప్రతిపాదనలు చేస్తున్నట్లు అందులో వచ్చిందని వైసిపి ఆరోపిస్తోంది. అయితే అందులో బిజెపి నేతలే దిగివచ్చి మీరు కోరినవాటిలో ప్రధానమైనవి ఇస్తాం...పోరాటం ఆపేయండని బ్రతిమాలుతున్నట్లు రాసారని, అయితే వాస్తవంగా టిడిపి ఎంపిలే వెళ్లి బిజెపి ముఖ్య నాయకులతో రాజీ చర్చలు జరిపారని...రాష్ట్రానికి సంబంధించి "ఏదో ఒక సానుకూల ప్రకటన చేసి మమ్మల్ని బయటపడే యండి రాజీపడతాం"... అని వారి ద్వారా చంద్రబాబు అభ్యర్థిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని వైసిపి చెబుతోంది.

English Title
ysrcp fire on chandhrababu naidu

MORE FROM AUTHOR

RELATED ARTICLES