ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కొత్త తలనొప్పి

Submitted by arun on Tue, 04/17/2018 - 12:19
sakshi maharaj

ఉత్తరప్రదేశ్‌లో కాషాయ దళానికి కొత్త తలనొప్పి మొదలైంది. సాధువు, బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ బార్, నైట్‌ క్లబ్‌ను ప్రారంభించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు షాకిచ్చారు. ఇప్పటికే ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన సాక్షి మహారాజ్ తాజాగా లెట్స్‌ మీట్ అన్న క్లబ్‌ను ప్రారంభించి విమర్శలకు కేంద్ర బిందువయ్యారు.

సాక్షి మహారాజ్‌ సన్యాసం స్వీకరించిన సాధువు. కమల పార్టీ తరపున ఉన్నావ్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన పార్లమెంట్ సభ్యుడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో‌లో నైట్‌ క్లబ్‌ను ప్రారంభించి విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. యుపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే మేనల్లుడు ఆలీగంజ్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన లెట్స్‌ మీట్‌ బార్ అండ్ నైట్‌ క్లబ్‌ను రిబ్బన్ కట్‌ చేసి ప్రారంభించారు. లెట్స్‌ మీట్‌ నిర్వాహకులు ఇచ్చిన దేవుడి విగ్రహాన్ని తీసుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో మాట మార్చేశారు. అది బార్ అన్న విషయం తెలియదన్న సాక్షి మహారాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సూచనతోనే వెళ్లానని చెబుతున్నారు.

తన చేత బార్‌ ఓపెన్‌ చేయిస్తారని ఊహించలేదని ఆహ్వాన పత్రికలో బార్‌ అని మాత్రమే ఉందన్నారు సాక్షి మహారాజ్. గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపారు. బహిరంగ ప్రదేశాల్లో యువతీ యువకుల అసభ్య ప్రవర్తన కారణంగానే అత్యాచారాలు జరుతున్నాయంటూ వ్యాఖ్యానించి వివాదం రేపారు. దీనిపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నుంచి అనేక విమర్శలు వచ్చాయ్. అంతేకాదు అత్యాచార కేసుల్లో ఊచలు లెక్కిస్తున్న డేరాబాబాను సైతం వెనకేసుకొచ్చి పత్రికల్లో ప్రధాన శీర్షికలకు ఎక్కారు. సంస్కృతి, సాంప్రదాయాలు అంటూ నీతులు చెప్పే బీజేపీ నేతలు నైట్‌క్లబ్‌ ప్రారంభించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయ్. 
 

English Title
Unnao MP Sakshi Maharaj inaugurates 'nightclub'

MORE FROM AUTHOR

RELATED ARTICLES