విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చిన ఈటల

x
Highlights

నీళ్లు, నిధులు, నియామకాలపై టీఆర్‌ఎస్‌, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదంటూ విమర్శిస్తోన్న...

నీళ్లు, నిధులు, నియామకాలపై టీఆర్‌ఎస్‌, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదంటూ విమర్శిస్తోన్న విపక్షాలకు అభివృద్ధి మంత్రంతో చెక్‌ పెట్టాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, చేపట్టిన నియామకాలు ఇలా అన్ని రంగాలపై నివేదికలు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీపై విపక్షాల చేస్తోన్న విమర్శలకు ఆర్ధికమంత్రి ఈటల లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు.

నీళ్లు, నిధులు, నియామకాలే తమ ప్రధానాస్త్రాలని విపక్షాలు ప్రకటించడంతో అధికార టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. విపక్షాలు చేస్తోన్న విమర్శలకు, ఆరోపణలకు మంత్రి ఈటల ఘాటుగా రిప్లై ఇచ్చారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన ఉద్యోగ నియామకాల నివేదికను విడుదల చేశారు. లక్షా 28వేల 274 ఉద్యోగాల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతులిచ్చినట్లు చెప్పిన ఈటల ఇందులో 87వేల 346 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనట్లు లెక్కలు చెప్పారు. అలాగే ఇప్పటివరకు 37వేల 781 ఉద్యోగ నియామకాలు పూర్తయినట్లు వివరించారు. ఇవేకాకుండా 23వేల విద్యుత్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసినట్లు చెప్పారు. అలాగే కనీస వేతన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి కిందిస్థాయి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా అన్ని విభాగాల ఉద్యోగుల జీతాలు భారీగా పెంచామని తెలిపారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆశతోనే విపక్షాలు అమలుకు సాధ్యంకాని హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు.

అయితే నిరుద్యోగుల్లో కొంత కోపం ఉండి ఉండొచ్చన్న ఈటెల విపక్షాలు విమర్శలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. అగ్రరాజ్యం అమెరికాలో సైతం ఉద్యోగాల కల్పన భారీగా తగ్గిందని, అయినా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించేది 4శాతమే అన్నారు. మిగతా 96శాతానికి ప్రైవేట్‌ రంగమే ఉద్యోగాలు కల్పిస్తోందన్న సంగతి తెలుసుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories